సాక్షి, హైదరాబాద్: కోట్ల రూపాయలు వెచ్చించి కొన్న వైద్య పరికరాలు దీర్ఘకాలం పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరికరాల నిర్వహణకు ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా వైద్య పరికరాల నిర్వహణకు సంబంధించిన పాత కాంట్రాక్టునురద్దు చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, యంత్రాల మరమ్మతుల కోసం ఫేబర్ సింధూరి మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) చేసుకున్న ఒప్పందాన్ని ప్రభు త్వం బుధవారం రద్దు చేసింది.
ఇక వైద్య పరికరాల నిర్వహణకు కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ఆస్పత్రుల్లో పనిచేయని పరీక్ష పరికరాలు, యంత్రాలను మరమ్మతు చేయించాలని అన్నారు. దీని కోసం కాంప్రహెన్సీవ్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రా క్ట్ (సీఏఎంసీ) పద్ధతిలో నేరుగా తయారీదారు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం ఈ అంశంపై టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో మంత్రి ఈటల చర్చించారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే మిషన్, రేడియాలజీ పరికరాలు సహా మొత్తం 20 పెద్ద యంత్రాల నిర్వహణ బాధ్యతను తయారుదారు కంపెనీలకే అప్పగించాలని నిర్ణయించారు. దీనివల్ల యంత్రాల మనుగడకు సంబంధించి ఎనిమిదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మధ్య రకం పరికరాల నిర్వహణ బాధ్యతను టీఎస్‌ఎంఐడీసీ పరిధిలో పనిచేస్తున్న బయోమెడికల్ ఇంజనీర్లకు అప్పగించనున్నారు.
ఏటా రూ.15 కోట్లు..
ప్రభుత్వాస్పత్రుల్లో తరచూ వైద్య పరికరాలు, యంత్రాలు మోరాయిస్తుండటంతో వాటిని రిపేర్ చేసేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన నిర్వహించేందుకు 2017 జూన్ 6న ఆ సంస్థతో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని 35 వేల వైద్య పరికరాల నిర్వహణను అప్పగించింది. ఈ మొత్తం యంత్రాల విలువ రూ.400 కోట్ల వరకు ఉంటాయి. ఆ విలువలో 5.7 శాతం మొత్తాన్ని ఏటా సదరు సంస్థకు చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం ఏడాదికి రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. రిపేర్‌కు వచ్చిన 7 రోజుల్లోనే సదరు సంస్థ ఇంజనీర్లు వెళ్లి ఆ యంత్రాలను బాగు చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఫేబర్ సింధూరి సంస్థ సకాలంలో వైద్య పరికరాలను రిపేర్ చేయలేకపోయింది.
ఫలితాలివ్వని ఒప్పందం..
గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ లాంటి బోధనాస్పత్రులతోపాటు జిల్లా ఆస్పత్రుల్లోని సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ లాంటి పరికరాలను రిపేర్ చేసే బాధ్యత ఆ సంస్థకు అప్పగించగా అనుకున్న ఫలితాలు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కోట్ల రూపాయలతో ఆధునిక పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రోజువారీ నిర్వహణను పట్టించుకోకపోవటంతో ఒక్కొక్కటిగా మూలన పడుతున్నాయి. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈటల.. ఆస్పత్రులను సందర్శిస్తున్నప్పుడు వీటిపై ఫిర్యాదులందాయి. దీంతో భవిష్యత్‌లో సమస్యలు తలెత్తకుండా ఆ వైద్య పరికరాలను సరఫరా చేసే సంస్థలకే నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించాలని ఓ నిర్ణయానికి వచ్చారు.
మూడేళ్ల తర్వాతే సీఏఎంసీ పద్ధతి..
ఒక కొత్త యంత్రాన్ని కొనుగోలు చేస్తే మొదటి మూడేళ్లు సదరు కంపెనీనే వారంటీ ఇస్తుంది. ఆ సమయంలో చెడిపోయినా, యంత్ర పరికరాల విడిభాగాలను రీప్లేస్ చేయాల్సి వచ్చినా ఉచితంగానే చేస్తారు. మూడేళ్ల తర్వాత సీఏఎంసీ పద్ధతిన తయారీదారు కంపెనీలే పరికరాల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో నాలుగో ఏ డాది నుంచి ఆ పరికరం సీఏఎంసీ పరిధిలోకి వస్తుంది. నాలుగో ఏడాది నుంచి ఆ మిషనరీ ఖరీదులో 5 శాతం చొప్పున ప్రభుత్వమే నిర్వహణ వ్యయాన్ని కంపెనీలకు చెల్లిస్తుంది. ఇలా ప్రతి ఏటా ఒక శాతం చొప్పున ఎనిమిదో ఏడాది వరకు చెల్లించాలన్నది ప్ర స్తుత నిర్ణయం. సాధారణంగా పరీక్షలు నిర్వహించే యంత్ర పరికరాల సగటు సామర్థ్యం ఎనిమిదేళ్లే.
నోడల్ ఏజెన్సీగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ..
ఒప్పందం అమల్లోకి వస్తే అన్ని ఆస్పత్రుల్లోని పరికరాలను వాటిని సరఫరా చేసే ఉత్పత్తి కంపెనీలే రిపే ర్లు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు వారితో సర్కారు సీఏఎంసీ ఒప్పందం చేసుకుంటుంది. దీనికి టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
మంత్రి ఈటల సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment