కొడిమ్యాల(చొప్పదండి) : అధికారిక కార్యక్రమం కంటే ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా భావించారు మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు బాధితులను తమ కాన్వాయ్‌లోని వాహనంలో ఆస్పత్రికి పంపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గోపాల్‌రావుపేటకు చెందిన కోమటి శేఖర్, భార్య నళిని, కుమారుడు చందూతో కలసి శనివారం కరీంనగర్‌లోని కూతురు ఇంటికి బైక్‌పై బయలుదేరారు. ఆరెపేట శివారులో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు జగిత్యాలలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించేందుకు కరీంనగర్ నుంచి వస్తున్నారు. రోడ్డుపక్కన విలపిస్తున్న ప్రమాద బాధితులను చూసి వాహనాలు ఆపి వారి వద్దకు వచ్చారు. క్షతగాత్రులను తమ కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మానవత్వంతో స్పందించిన మంత్రులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment