సాక్షి, హైదరాబాద్: జీవనోపాధి కోల్పోతున్నారన్న కారణంతోనే లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సడలింపులు ఇవ్వడంతో జనాలు ఎక్కువ మంది బయటకు వస్తున్నారని, దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరిగిందన్నారు. వయోవృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారికి కరోనా వైరస్ సోకితే ప్రమాదమని, ఈ క్ర మంలో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రభుత్వం సూచించినట్లుగా ప్రజలు జాగ్రత్త పడకుంటే కష్టమని వివరించారు. ఆదివారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ ‘కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ పట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదు. హోం క్వారంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని హాస్పిటల్ నుండి బయటకి రానివ్వడం లేదు. చిన్న ఇల్లు ఉన్న వారు, ఇంట్లో ప్రత్యేక గది వసతి లేని వారు హాస్పిటల్‌లోనే ఉండాలని కోరుకుంటున్నారు.
మరోపక్క పాజిటివ్ పేషెంట్ ఇంటి పక్కన ఉంటే తమకూ వైరస్ సోకుతుందేమో అన్న భయం ప్రజల్లో ఉండ డం వల్ల చాలామంది హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారు. జియాగూడలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.’ అని అన్నారు. రోజురోజుకీ ఆసుపత్రుల్లో ఉండే వారి సంఖ్య పెరిగితే మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ హైదరాబాద్ తీసుకువచ్చి చికిత్స అందించడం సాధ్యం కాదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, చికిత్స చేయాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు.
హలో.. ఆరోగ్యం ఎలా ఉంది?
కరోనా వైరస్ సోకిన వైద్యులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులతో మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. వారి యోగక్షేమాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కరోనాతో చేస్తున్న పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, జర్నలిస్టులు సైతం వైరస్ బారిన పడుతున్నారన్నారు. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వారికి అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment