సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులను ఆదుకోవడం ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల రాజ్యాంగ బాధ్యతని హైకోర్టు స్పష్టం చేసింది. వలస కార్మికులను ఆదుకునే విషయంలో తామిచ్చిన ఉత్తర్వులను మెడపై కత్తిలా ఉన్నాయన్న భావన ఏమాత్రం సరికాదని రైల్వేశాఖకు హైకోర్టు హితవు పలికింది. న్యాయస్థానం ఆదేశాలను అలా ఎప్పటికీ చూడరాదని స్పష్టం చేసింది. చిట్టచివరి వలస కార్మికులు గమ్యస్థానానికి చేరే వరకు తమ ఉత్తర్వులు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. వలస కార్మికుల తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ అనుసరిస్తున్న విధానాలు కొనసాగించాలని స్పష్టం చేసింది.
అధికరణ 226 కింద వలస కార్మికులకు అండగా నిలబడాల్సిన బాధ్యతపై న్యాయస్థానాలపై ఉందని గుర్తుచేస్తూ విచారణను వాయిదా వేసింది. ఇటుక బట్టీల కార్మికులకు సంబంధించి మానవ హక్కుల వేదిక సమన్వయకర్త ఎస్.జీవన్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది. అయితే వలస కార్మికుల తరలింపు విషయంలో ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయడం లేదంటూ ప్రొఫెసర్ రామ్ శంకర్ నారాయణ్ మేల్కొటే దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయ మూర్తి బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కృతజ్ఞతలు చెప్పిన వలస కార్మికులు
అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 418 మంది వలస కూలీలు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారని, ఇందుకు హైకోర్టుకు, ప్రభుత్వానికి, రైల్వేశాఖకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఇటుక బట్టీల కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారని, అందువల్ల ఆ అంశానికి సంబంధించిన వ్యాజ్యంపై విచారణ ముగించవచ్చునన్నారు. సికింద్రాబాద్‌లో ఉన్న షెల్టర్ హోంలో 20 మంది మాత్రమే ఉన్నారని, ఈ హోంను మూసివేస్తే ప్రజారోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, వలస కార్మికుల తరలింపు విషయంలో చేసిన ఏర్పాట్లను కొనసాగిస్తామన్నారు. కావాలంటే కోర్టు ఆదేశాలు ఇవ్వొచ్చునని తెలిపారు.
రైల్వే శాఖ న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, సికింద్రాబాద్–దానాపూర్ రైల్‌లో 113 బెర్తులు, హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 21 బెర్తులు కేటాయించామని చెప్పారు. ఇకపైనా ఏర్పాట్లను కొనసాగిస్తామన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యాలపై విచారణను ముగించాలని, హైకోర్టు ఉత్తర్వులు తమ మెడపై కత్తిలా ఉన్నాయని ఆమె అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అలాంటి భావన సరికాదని, వలస కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment