గవర్నర్ తమిళిసైకి మొక్కను బహూకరిస్తున్న మాజీ ఎంపీ కవిత
కవాడిగూడ: స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ కమిటీ దేశంలోనే రోల్‌మోడల్‌గా ఎదగాలని రాష్ట్ర గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర ప్యాట్రన్ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. దీనికిగానూ గైడ్స్‌కు తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. గురువారం దోమలగూడ గగన్ మహల్‌లోని ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. తాను కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినేనని గుర్తుచేశా రు. సమాజానికి ఏ విధంగా సహాయం చేయాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఇక్కడే నేర్చుకున్నానని తెలిపారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు గైడ్స్ శిక్షణ తీసుకున్నానని చెప్పారు. అనంతరం తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ స్కౌట్స్ డ్రెస్‌లో రావడం సంతోషంగా ఉందన్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్‌లో అన్ని వసతులు ఉన్నాయని, ప్రస్తుతం ఇక్కడ 590 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా చేపడుతోన్న కార్యక్రమాలపై ఆమె నివేదిక సమర్పించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల ప్రాంగణంలో గవర్నర్‌తో కలిసి ఆమె మొక్కలను నాటారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా 8 మంది విద్యార్థులకు రాజ్యపురస్కారాలను అందించారు. కాగా, పీయర్స్ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ అస్లాం బిన్ మహ్మద్ రూ.10 లక్షల విరాళం చెక్‌ను గవర్నర్‌కు అందజేశారు. కవిత కూడా రూ.5 లక్షలు అందించా రు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజగోపాల్, జాయింట్ సెక్రటరీ మంచాల వరలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment