
లక్ష్యానికి మించి ‘ఉపాధి హామీ’
నిధుల కొరతతో నిలిచిన వేతన చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం పనులు నిర్దేశిత లక్ష్యాన్ని మించి జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేవలం 10 కోట్ల పనిదినాలు మంజూరు చేసింది. అక్టోబర్ చివరి నాటికి 7.5 కోట్ల పనిదినాలు లక్ష్యం కాగా, తీవ్ర కరువు నేపథ్యంలో ఇప్పటికే 8.5 కోట్ల పనిదినాలను కల్పించారు. డిసెంబర్ నాటికి 10 కోట్ల పనిదినాలు పూర్తవుతాయని, ఆపై మార్చి వరకు మరింత డిమాండ్ ఏర్పడే అవకాశ మున్నదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన రూ.1200 కోట్లు ఖర్చయిపోగా, నెలరోజులుగా చేపట్టిన ఉపాధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా తొమ్మిది జిల్లాల్లో లక్షలాది మంది ఉపాధి కూలీలకు రోజూవారీ వేతనాలు నిలిచిపోయాయి. వరుస పండుగల నేపథ్యంలో వేతనాల కోసం కూలీలు ఎదురుచూస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరుకోట్ల పనిదినాలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ఈ నెలాఖరుకల్లా కనీసం 4 కోట్ల పనిదినాలైనా మంజూరు కావచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్‌ఈఎఫ్‌ఎంఎస్ ద్వారా చెల్లింపునకు యోచన
ఉపాధిహామీ పనులకు వచ్చిన కూలీలకు సకాలంలో వేతన చెల్లింపులు చేసే నిమిత్తం జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఎన్‌ఈఎఫ్‌ఎంఎస్) వ్యవస్థను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ పనుల నిమిత్తం అవసరమైన నిధులను తాము ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలకు జమ చేస్తున్నప్పటికీ, అవి సకాలంలో విడుదల చేయని కారణంగా ఉపాధిహామీ పథకం ఉద్దేశం దెబ్బతింటోందని కేంద్రం భావిస్తోంది.
పనులు చేసిన కూలీల వేతన వివరాలను కేంద్రానికి పంపితే వారి ఖాతాలకు నేరుగా వేతనసొమ్మును జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్‌ఈఎఫ్‌ఎం వ్యవస్థపై అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. నవంబర్ నుంచే నూతన చెల్లింపు వ్యవస్థ అమలుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.