మెట్‌పల్లిరూరల్: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ గౌడ్ గురువారం సాయంత్రం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెట్‌పల్లి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మల్లాపూర్‌లో గెజిట్ నం.275తో మద్యం దుకాణం నిర్వహిస్తున్న కోటగిరి ఆనంద్‌ను కొన్ని నెలలుగా లక్ష్మణ్‌గౌడ్ లంచం కోసం వేధిస్తున్నారు. జనవరి నెలలో మల్లాపూర్‌లోని ఆనంద్‌కు చెందిన వైన్సులో ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ గౌడ్ ఉద్దేశ పూర్వకంగా బిల్లులు సృష్టించి, పలువురితో ఫిర్యాదులు చేయించారు.
జగిత్యాల ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలసి వైన్స్‌పై దాడి చేసి, షాపును సీజ్ చేశాడు. ఆ కేసులో దుకాణం యజమాని ఆనంద్ అదే నెలలో ప్రభుత్వానికి జరిమానాగా రూ.1లక్ష చెల్లించి మద్యాన్ని తిరిగి తెరిచాడు. అనంతరం రూ.45 వేలను తనకు లంచం కింద ఇవ్వాలని కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం వరకు లంచం డబ్బులు చెల్లించక పోతే మళ్లీ వైన్సుపై దాడి చేసి, కేసులు నమోదు చేస్తానని బెదిరించినట్లు యజమాని ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. చేసేది లేక ఏసీబీ అధికారులను సంప్రదించానని ఆయన వివరించాడు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు
సుదర్శన్ గౌడ్, ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగనవట్ల గ్రామానికి చెందిన మెట్‌పల్లి ఎక్సైజ్ సీఐ టమాటం లక్ష్మణ్ గౌడ్ 2005లో ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం పొందారు. సీఐగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో విధులు నిర్వహించి, 2013లో బదిలీపై మెట్‌పల్లికి వచ్చారు. కాగా, గురువారం ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో ఆనంద్ నుంచి రూ.45 వేల లంచం తీసుకుంటు లక్ష్మణ్‌గౌడ్ మాకు పట్టుబడ్డాడు. సీఐపై కేసు నమోదు చేసి, తమ అదుపులోకి తీసుకొని పలు ఆరోపణలపై విచారించనున్నాం.