సాక్షి, హైదరాబాద్: ‘ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు కీలక సమయం ఆసన్న మైంది. కోవిడ్–19 మహమ్మారి కోరలు చాచిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. జీవ వైవిధ్యంలో ముఖ్యభాగమైన వన్య ప్రాణులు, జంతువుల పరిరక్షణకు నడుం బిగించాలి. వివిధ రకాల వన్యప్రాణులు, జంతువులు, పక్షుల నుంచే 80 వరకూ వ్యాధులకు చెందిన వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నందున, వీటి పట్ల విచక్షణతోపాటు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుత విపత్కర పరిస్థితులను అంచనా వేసు కుని భవిష్యత్తులో మరింత భయం కరమైన పరిస్థితులు వ్యాధుల రూపంలో దండెత్తకుండా కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించుకుని అమలు చేసేందుకు ఇదే సరైన సమయం’అని వివిధరంగాలకు చెందిన పర్యావరణవేత్తలు, నిపుణులు అభిప్రాయ పడ్డారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ‘సెలబ్రేట్ బయో డైవర్సిటీ’ పేరిట ప్రపంచ పర్యావరణ దినో త్సవాన్ని జరుపుకున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరిం చుకున్న అంశాలపై వారు ‘సాక్షి’కి వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.
వచ్చేవి పెనుసవాళ్లతో కూడుకున్న రోజులే..
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేనిపక్షంలో భారత్ నుంచి మరో మహమ్మారి ప్రబలే అవకాశాలు పొంచి ఉన్నాయి. వన్యప్రాణులు, జంతువుల ఆవాసాలు కుంచించుకు పోవడం, జీవవైవిధ్యానికి నష్టం చేసే చర్యలు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా పర్యావరణం, అడవులు మెరుగైనట్టు పైకి కనిపిస్తున్నా, స్వల్పకాలంలోనే మళ్లీ కాలుష్యం పుంజుకుని పాతస్థితికి చేరుకుంటుంది. ఎనభై వరకు వ్యాధులు ప్రకృతి విధ్వంసంతో పాటు జంతువుల నుంచి సోకే వైరస్‌తోనే వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. ఎబోలా, సార్స్, స్వైన్‌ఫ్లూతో పాటు వివిధ జబ్బులు కోతులు, పక్షులు,పందులు, ఇతర జంతువుల నుంచి వ్యాప్తి చెందినట్టు వెల్లడైంది. కొన్ని జంతువుల, పక్షుల భక్షణ వల్ల కొత్తవ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్‌లో వచ్చే కొత్త వ్యాధులతో ప్రజలకు ఎలాంటి తీవ్రమైన ఉపద్రవం ముంచుకొస్తుందా అనేది ఊహకు కూడా అందడం లేదు. అందువల్ల రాబోయే రోజులు పెనుసవాళ్లతో కూడుకున్నవే. – ఇమ్రాన్ సిద్దిఖీ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ
ఆత్మవిమర్శకు ఇదే సమయం
లాక్‌డౌన్ కాలంలో వన్యప్రాణులు, జంతువులు జనావాసాలకు వచ్చాయంటే అడవులు, ఆ చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అర్థం చేసుకోవచ్చు, మనుషులు,జంతువుల మధ్య సంఘర్షణను అధిగమించేందుకు కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. కోతులు, ఎలుగుగొడ్లు వంటివి గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి నిజమే. కానీ అవి జనావాసాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇందుకు గల కారణం ఎవరన్నది మనం ఇప్పుడు ఆలోచించాలి. ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యానికి జరిగే నష్టంలో మనం పోషించే పాత్రపై తక్షణమే ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఫరీదా తంపాల్, స్టేట్ డైరెక్టర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్– ఇండియా
ప్రస్తుత పరిణామాలు మనకొక గుణపాఠం
‘కోవిడ్–19’ పరిస్థితుల్లో మనం గుణపాఠం నేర్చుకున్నాం. వన్యప్రాణులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిసొచ్చింది. వాటికి చెందిన ఆవాసాల్లోకి, ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకుండా, వాటి జీవనశైలిని అస్థిర పరచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు మానవ హక్కులు ఎంత ముఖ్యమో జంతువుల హక్కులను సైతం రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అవగాహన అవసరం. ప్రకృతి, పర్యావరణంలో ప్రతీ జీవి లేదా వాటి జాతుల ప్రాణాలు అనేవి ఎంతో ముఖ్యం. ప్రతీ జీవి తన ›ప్రత్యేక పాత్ర పోషించాల్సి ఉంటుంది. జీవరాశుల్లో భాగమైన జంతువులు, వన్యప్రాణులు, పక్షులు ఇలా అన్ని రకాల జీవులు, ప్రాణులను స్వేచ్ఛగా బతకనివ్వాలి. వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ ఎ.శంకరన్
Comments
Please login to add a commentAdd a comment