
ఆ 50 లక్షల్లో దొంగ నోట్లు?
ఆ దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో మొదటి విడతగా చెల్లించిన రూ.50 లక్షల నోట్లకట్టల్లో దొంగనోట్లున్నాయా? తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు చెల్లిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ ఆ డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది. అందులో కొన్ని దొంగ నోట్లు ఉన్నట్టు తేలిందని తెలిసింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? ఐటీ లెక్కలున్నాయా? వంటి వివరాలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేస్తోంది.
ఈ కేసు విచారణలో ఆ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేశారా? లేక ఎవరైనా పారిశ్రామిక వేత్త నుంచి తెచ్చారా? అన్న విషయంపై ఆరా తీసిన తర్వాత ఏసీబీ ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలిపే అవకాశాలున్నాయి. అయితే వాటిని లెక్కించిన అధికారులు అందులో దొంగనోట్లు ఉన్నాయని తెలియడంతో ఇప్పు డు దానిపైనా దృష్టి సారించినట్టు అధికారవర్గాల సమాచారం. కాగా గతంలో ఏపీ సీఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఒకరు దొంగ నోట్ల కేసులో పట్టుబడిన ఉదంతం నేపథ్యంలో వ్యవహారం ఎటు మళ్లుతుందోనని చర్చ జరుగుతోంది.