రైతుల ఆత్మహత్యలు ‘లెక్క’లేదా? | Farmer suicides Record in nalgonda district | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మహత్యలు ‘లెక్క’లేదా?

Published Fri, Nov 7 2014 1:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

రైతుల ఆత్మహత్యలు ‘లెక్క’లేదా? - Sakshi

రైతుల ఆత్మహత్యలు ‘లెక్క’లేదా?

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరుణుడు కరుణించలేదు..సకాలంలో వర్షాలు కురవలేదు.. కరెంట్ లేక బోర్లు పోయడం లేదు... పంటచేతికొచ్చే పరిస్థితి లేదు.. అప్పులు తీరేమాట దేవుడెరుగు...పెట్టుబడి కూడా వస్తుందన్న నమ్మకం లేదు... కుటుంబం ఎలా గడుస్తుందనే ఆవేదన.. అప్పులెలా తీర్చాలనే మానసిక క్షోభ... కళ్లెదుటే  పంటలెండుతుంటే తట్టుకోలేని బాధ... బోర్లు వేస్తున్నా.. అప్పులు కుప్పలవుతున్నాయే తప్ప చుక్క నీరు రాని ఆక్రందన... వెరసి జిల్లాలో అన్నదాత ఉసురు తీసుకుంటున్నాడు. మానసిక స్థైర్యాన్ని కోల్పోయి అయిన వారిని వదిలిపెట్టి కానరాని లోకాలకు వెళ్లి పుట్టెడు దుఃఖాన్ని మిగిలిస్తున్నాడు... ఇదంతా ఎవరో చెబుతున్నది కాదు.. జిల్లాలో కళ్లకు కడుతున్న వాస్తవ పరిస్థితి. ప్రభుత్వ లెక్కలు నిర్ధారిస్తున్న నగ్న సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన  నాటినుంచి జిల్లాలో మొత్తం 17 మంది వ్యవసాయ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని జిల్లాయంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. రాష్ట్రం ఏర్పాటైన  జూన్ 2వతేదీ నుంచి ఎంత మంది చనిపోయారు... ఎందుకు చనిపోయారన్న దానిపై పరిశీలన జరిపింది.
 
 ఒకే నెలలో 17 మంది
 రైతుల ఆత్మహత్యలు రికార్డయిన ప్రకారం చూస్తే జూన్2 నుంచి అక్టోబర్ 31 వరకు మొత్తం 52 మంది చనిపోయారని జిల్లా అధికారులు లెక్కకట్టారు. ఇందులో అత్యధికంగా అక్టోబర్ నెలలోనే 17 మంది ప్రాణాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌లో 11 మంది, ఆగస్టులో ఆరుగురు. జూలైలో 9 మంది, జూన్‌లో ఏడుగురు చనిపోయారు. మరో ఇద్దరి మరణాల తేదీలను నమోదు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన జూన్2న కూడా ఓ ఆత్మహత్య నమోదైంది. నిడమనూరు మండలం ధర్మాపురం గ్రామంలో రైతు నూనె నర్సింహ ఆరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన వ్యవసాయ కారణాలతోనే ప్రాణం తీసుకున్నట్టు అధికారులు నిర్ధారించారు కూడా. అయితే, ఆత్మహత్యలను పరిశీలిస్తే ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చేసరికి మరణాలు పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. సీజన్ ప్రారంభం కన్నా పంట చేతికొస్తున్న తరుణంలో ఈ ఆత్మహత్యలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
 
 అంతా పరిశీలించారంట...
 గత ఐదు నెలల కాలంలో పదుల సంఖ్యలోనే రైతుల ఆత్మహత్యలు జిల్లాలో నమోదయ్యాయి. అయితే, రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ కారణాలే కాకుండా ఇతర కారణాలు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. గ్రామాల్లో 80శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారు కనుక వారిలో ఎవరు చనిపోయినా పంటలు నష్టపోయో, అప్పులు పెరిగిపోయో చనిపోయారని భావించాల్సిన పనిలేదు. అందులో భాగంగానే కొత్త రాష్ట్రం ఏర్పాటయిన జూన్2 నుంచి చనిపోయిన వారిలో రైతు ఆత్మహత్యలు ఎన్ని అనే దానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేసింది. ఇందుకోసం రెవెన్యూ డివిజన్ల వారీగా త్రీమెన్‌కమిటీలను ఏర్పాటు చేసింది.
 
 ఇందులో సభ్యులుగా ఆర్డీఓ, వ్యవసాయ శాఖ అధికారి, స్థానిక డీఎస్పీని  నియమించింది. పోస్టుమార్టం నివేదికలు, ఎఫ్‌ఐఆర్‌లతో పాటు క్షేత్రస్థాయిలో ఈ కమిటీ విచారణ జరిపింది.  అనంతరం ఐదు నెలలకాలంలో జిల్లాలో మొత్తం 17 మంది రైతులు వ్యవసాయ కారణాలతోనే ఆత్మహత్యల పాలయ్యారని అధికార యంత్రాంగం నిర్ధారించింది. చందంపేట, చింతపల్లి, నిడమనూరు, నల్లగొండ మండలాల్లో ఇద్దరు చొప్పున, చండూరు, కనగల్, కేతేపల్లి, మునుగోడు, పెదవూర, పెన్‌పహాడ్, శాలిగౌరారం, తిప్పర్తి, వేములపల్లిలలో ఒకరు చొప్పున ఆర్థిక బాధలతోనే ప్రాణాలు తీసుకున్నారని తేల్చి చెప్పింది. వీరికి నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
 
 ఏం పరిశీలించారో ఏమో....
 రైతుల ఆత్మహత్యల నిర్ధారణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకుని పరిశీలన జరిపిన జిల్లా యం త్రాంగం ఇచ్చిన నివేదిక పలు సందేహాలకు తావి స్తోంది. జూన్ రెండు నుంచి లెక్కిస్తున్నామని చెప్పిన అధికారులు జనవరిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలను కూడా నివేదికలో పొందుపరిచారు. అదే జనవరి నుంచి లెక్కిస్తే రైతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఈ ఐదు నెలల కాలంలో మొత్తం 52 రికార్డు కాగా, అందులో 35 మందివి రైతు ఆత్మహత్యలు కావని, ఇతర కారణాలతో వారు చనిపోయారని తేల్చారు. ఇందులో 22 మంది కుటుంబ కారణాలతో చనిపోయారని, ఇద్దరు ఆరోగ్య, ముగ్గురు వ్యక్తిగత కారణాలతో చనిపోగా, ముగ్గురిది సహజ మరణమని, ఒక్కరు మద్యానికి బానిసై చనిపోయారని, మరొకరు గుండెపోటుతో చనిపోయారని నివేదికలో పేర్కొన్న అధికారులు మరో ముగ్గురి తిరస్కరణకు కారణాలు మా త్రం చెప్పలేదు.
 
 విశేషమేమిటంటే... ఒక పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగానే (సాక్షి కాదు)  తొమ్మిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారులు తేల్చారు. మరి పత్రికల్లో వార్తల ఆధారంగా రైతుల ఆత్మహత్యలను నిర్ధారించాలనుకున్నప్పుడు త్రీమెన్‌కమిటీని ఎందుకు వేశారో, కమిటీ సభ్యులు ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. ఇక దామరచర్ల మండలంలో జరిగిన ఓ రైతు ఆత్మహత్య మద్యానికి బానిసై జరిగిందని నివేదికలో ఇచ్చారు. ఈ సిఫారసు చూస్తే అసలు ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన జరిపిందా లేదా అనే అనుమానం కలగక మానదు. వాస్తవానికి ఆ రైతు చనిపోయింది వ్యవసాయంలో నష్టపోయి పేరుకుపోయిన ఆర్థిక భారంతోనేనన్నది వాస్తవమని స్థానికులు చెబుతున్నారు.
 
 గుర్రంపోడు మండలంలో నమోదైన మరో రైతు ఆత్మహత్య కూడా అలాంటిదే. ఆయనా కుటుం బ కారణాలతో చనిపోయారని నివేదికలో చెప్పారు. కానీ ఆయనది రైతు ఆత్మహత్యేనని తేలింది. ఓ రాజకీయ పార్టీ నియమించిన కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కానీ, అధికారులు మాత్రం ఆయనది రైతు ఆత్మహత్య కాదని సెలవిచ్చారు. మచ్చుకు ఈ రెండు ఉదాహరణలే తీసుకున్నా... ఇంకామరింత పరిశీలన జరిపితే రైతులు ఎంత మంది వాస్తవంగా ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు తీసుకున్నారనేది తేలుతుందని, జిల్లా యంత్రాంగం మరోసారి ఆ కసరత్తు జరపాలని ప్రజాసంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
 మానసిక ఆందోళనే ప్రాణాలు తీస్తోంది
 రైతుల ఆత్మహత్యలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో ఆశతో మొదలుపెట్టిన వ్యవసాయం కష్టాలను మిగులుస్తుండడం రైతుల్లో తీవ్ర మానసిక వేదనకు కారణమవుతోంది. జిల్లాలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను పరిశీలిస్తే ఎక్కువ మంది ఎకరం, రెండెకరాల రైతులే. ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశ అందరి లాగే రైతుకు కూడా ఉంటుంది. అందుకే వీరంతా వీరికి ఉన్న భూమికి తోడు మరో 4-10 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. పంటదిగుబడి ఎలా ఉన్నా కౌలు మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిందే.
 
 మరోవైపు గ్రామాల్లో నెలకొన్న అనారోగ్య వాతావరణం, రైతుల్లో ఉన్న పోటీ కారణంగా కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడుతుండడం, కూలీల ధరలు పెరగడంతో ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో రాబడికీ, ఖర్చుకు మధ్య తేడా పెరిగిపోయింది. వర్షాలు లేకపోవడం, కరెంటు లేకపోవడంతో రాబడిపై నమ్మకం తగ్గింది. రైతుల్లో నెలకొన్న ఈ అభద్రతాభావం, అపనమ్మకాన్ని పోగొట్టాలంటే రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడడం శ్రేయస్కరం కాదనే భావనను కలిగించడంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను పెంచాలి.’
 - ప్రొఫెసర్ కె.అంజిరెడ్డి, ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్,  మహాత్మాగాంధీ యూనివర్సిటీ
 
 ప్రభుత్వ లెక్కల ప్రకారం
 ఆత్మహత్యలు చేసుకున్న రైతులు (నెలల వారీగా)
 నెల    రైతుల సంఖ్య
 అక్టోబర్    17
 సెప్టెంబర్    11
 ఆగస్టు    06
 జూలై    09
 జూన్    07
 (ఇద్దరి మరణాల తేదీని నమోదు చేయలేదు)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement