సాక్షి, నేరేడుగొమ్ము: నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ములో దారుణం వెలుగుచూసింది. తన బావి పక్కన బోరు వేయోద్దని అడ్డుకున్నందుకు కులం పేరుతో దూషించి, దాడి చేయడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నేరేడుగొమ్ముకు చెందిన సీలం తిరుపతయ్య(45) తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 22న తన పక్కనే పొలం ఉన్న సత్యనారాయణ కొత్తగా బోరు వేయించాడు. తన బావి సమీపంలోనే బోరు వేస్తుండటంతో.. దీని వల్ల తన బావిలో నీళ్లు లేకుండా పోతాయని తిరుపతయ్య వారిని అడ్డుకొని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి తిరుపతయ్యపై పగ పెంచుకున్న సత్యనారాయణ ఆదివారం గ్రామ సభ్యులందరి సమక్షంలో కులం పేరుతో దూషించడంతో పాటు అతనిపై దాడి చేశాడు.
అనంతరం రాత్రి ఇంటికి వచ్చి బూతులు తిడుతూ మళ్లీ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతయ్య ఈ రోజు తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలిస్తుండగా.. అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రామ్‌గోపాల్ రావు సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment