పోలీసులతో వాగ్వావాదానికి దిగిన రైతులు
పెర్కిట్/జక్రాన్‌పల్లి: తమ డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన పాదయాత్రను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. ఎర్రజొన్న, పసుపు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా మంగళవారం చలో అసెంబ్లీ పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జక్రాన్‌పల్లి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో రెండు వేల మంది రైతులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఐదు కిలో మీటర్ల వరకు సాఫీగా సాగిన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సికింద్రాపూర్ వద్ద జాతీయ రహదారికి అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా బలగాలను మోహరించారు.
పాదయాత్రకు అనుమతి లేదని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆందోళన విరమించాలని రైతులకు సూచించారు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ నిరసనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడానికే శాంతియుతంగా పాదయాత్ర చేపట్టామని, తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని రైతులు వేడుకున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను దాటుకుని ముందుకు కదిలారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అరెస్ట్ చేసి సమీపంలోని స్టేషన్‌లకు తరలించారు. కేశ్‌పల్లి ఎక్స్ రోడ్డు వద్ద మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పంట పొలాల వైపు పరుగెత్తిన రైతుల వద్దకు కమిషనర్ కార్తికేయ వెళ్లి మాట్లాడి సముదాయించి వారిని వెనక్కి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment