Jakranpally
-
ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్ విద్యార్థి..
సాక్షి, నిజామబాద్: జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండ లంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి తొర్లికొండలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. అయితే మంగళవారం ఉదయం హాస్టల్ నుంచి పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో రెండో పీరియడ్ జరుగుతున్న సమయంలో సదరు విద్యార్థి వచ్చినట్లు తెలిపారు. తరగతులు జరుగుతున్న సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడని తెలిపారు. గట్టిగా శబ్ధం రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి చూశారు. విద్యార్థికి తీవ్రగాయాలవడంతో 108 అంబులెన్స్‌లో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కిరణ్ ఓ బాలికను ఏడో తరగతి నుంచే ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వివరాలు అడగగా తాను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు. పాఠశాల ఆవరణలో కింద ఓ అమ్మాయితో కాసేపు మాట్లాడానని పేర్కొన్నాడు. అదే సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని చెప్పాడు. ఇద్దరి మధ్య ప్రేమ విఫలం కావడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి ఎంఈవో శ్రీనివాస్, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపి వచ్చి సదరు విద్యార్థితో మాట్లాడారు. -
నిజామాబాద్ జిల్లాలో ఆటవిక రాజ్యం
-
నిజామాబాద్ జిల్లాలో ఆటవిక రాజ్యం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీ చర్యలు ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నాయి. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలో 100 వడ్డెర కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. గతంలో స్మశానవాటికలో తవ్వకాలను వడ్డెర కులస్తులు అడ్డుకున్నారు. తవ్వకాలను అడ్డుకోవడంతో వడ్డెర కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ కక్ష పెంచుకుంది. వడ్డెర కులస్తులతో మట్లాడినా, కిరాణ సరుకులు అమ్మినా రూ.10 వేలు జరిమానా విధించింది. దీంతో న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను వడ్డెర కులం వారు వేడుకున్నారు. వడ్డెర కుటుంబాలను బహిష్కరించిన మునిపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని వడ్డెర సంఘం సభ్యులు నిరసన చేపట్టారు -
తహసిల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
సాక్షి, నిజామాబాద్ : జక్రాన్ పల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట అర్గుల్ రైతులు ఆందోళనకు దిగారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు పట్టా భూములు ఇవ్వమంటూ రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే హైవే కోసం భూములు ఇచ్చి నష్టపోయామని, 600 ఎకరాలు కాకుండా 300 ఏకరాలే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, రైతుల ఆందోళనతో జిల్లాలో ఎయిర్ పోర్ట్ అథారిటీ బృందం తమ పర్యటనను వాయిదా వేసుకుంది. సర్వే పనులను రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో పర్యటనును వాయిదా వేసుకుంది. -
అధ్యయనం తర్వాతే ఎయిర్ పోర్టు !
సాక్షి, జక్రాన్‌పల్లి (నిజామాబాద్): జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదన ఉంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ డీజీఎం అమిత్ కుమార్‌తో పాటు ఏజీఎంలు నీరవ్ గుప్తా, కుమార్ వైభవ్‌లు స్థల పరిశీలనకు వచ్చారు. ల్యాండ్ ఓరియంటేషన్, విండ్ డైరెక్షన్, ల్యాండ్ ఫిజిబులిటీ వివరాలు సేకరించారు. వీటన్నింటిని అధ్యయనం చేసిన అనంతరం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన డీపీఆర్ ప్రకారం ఎయిర్‌పోర్టుకు ఈ స్థలం అనుకూలమా.. కాదా అనేది తేలుతుంది. కాగా ఎయిర్ పోర్టు ప్రతినిధుల బృందం సభ్యులు జక్రాన్‌పల్లి, మనోహరాబాద్, తొర్లికొండ, కొలిప్యాక్, అర్గుల్ గ్రామాల పరిధిలో గల 850 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డీజీఎం అమిత్ మిష్రా మాట్లాడుతూ జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించామన్నారు. ఫ్యూచర్లో జాతీయ రహదారిపై ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడడం, ఎయిర్‌పోర్టు మొత్తం విస్తీర్ణం, రన్ వే ఓరియంటేషన్ తదితర విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామన్నారు. అనంతరం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ప్రతినిధుల బృం దంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్ రావు, «ఆర్డీవో శ్రీని వాస్, తహసీల్దార్ కిషన్, ధర్పల్లి జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ దీకొండ హరిత, తదితరులు పాల్గొన్నారు. -
రైతు పాదయాత్ర భగ్నం
పెర్కిట్/జక్రాన్‌పల్లి: తమ డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన పాదయాత్రను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. ఎర్రజొన్న, పసుపు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా మంగళవారం చలో అసెంబ్లీ పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జక్రాన్‌పల్లి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో రెండు వేల మంది రైతులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఐదు కిలో మీటర్ల వరకు సాఫీగా సాగిన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సికింద్రాపూర్ వద్ద జాతీయ రహదారికి అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. పాదయాత్రకు అనుమతి లేదని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆందోళన విరమించాలని రైతులకు సూచించారు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ నిరసనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడానికే శాంతియుతంగా పాదయాత్ర చేపట్టామని, తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని రైతులు వేడుకున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను దాటుకుని ముందుకు కదిలారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అరెస్ట్ చేసి సమీపంలోని స్టేషన్లకు తరలించారు. కేశ్‌పల్లి ఎక్స్ రోడ్డు వద్ద మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పంట పొలాల వైపు పరుగెత్తిన రైతుల వద్దకు కమిషనర్ కార్తికేయ వెళ్లి మాట్లాడి సముదాయించి వారిని వెనక్కి పంపించారు. -
మలేషియా ఉద్యోగాల పేరుతో మోసం
నిజామాబాద్ : మలేషియాలో 10 మంది నిజామాబాద్ వాసులు ఇరుక్కుపోయారు. ఓ గల్ఫ్ ఏజెంట్, రూ.35 వేలు జీతం అని చెప్పి విజిట్ వీసాలతో పది మందిని మలేషియా పంపించాడు. మలేషియాలో తిండీ గూడు లేక తిరిగొచ్చేందుకు డబ్బులు నరకయాతన పడుతున్నారు. బాధితుల స్వస్థలం బాల్కొండ మండలం జక్రాన్ పల్లి. రూ.60 వేలు కట్టబెట్టి వచ్చినా నిలువునా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వాట్సప్ వీడియోల ద్వారా బంధువులకు, స్నేహితులకు సమాచారం పంపారు. ఈ సమాచారం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
గరుడ బస్సులో మంటలు
జక్రాన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రం వద్ద గరుడ ప్లస్ ఏసీ బస్సుకు మంగళవారం సాయంత్రం కొద్దిలో ప్రమాదం తప్పింది. బస్సు వెనుక వైపు నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే నిలిపివేశాడు. బస్సు రన్నింగ్‌లో ఉండగానే టైరుకు మంటలు అంటుకున్నాయి. దీంతో వెనుక టైరు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ బస్సు 40 మంది ప్రయాణికులతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతోంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రివేళలో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
వ్యక్తి దారుణ హత్య
నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) : జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామ శివారులో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. బండరాళ్లతో మోది హత్య చేసిన తర్వాత శవాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగులబెట్టారు. చనిపోయిన వ్యక్తి ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన యాదగిరి(40)గా గుర్తించారు. ఈనెల 17న యాదగిరి కనిపించటంలేదని కుటుంబసభ్యులు ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఆ రోజు నుంచి కేసు దర్యాప్తులో ఉంది. కాగా శుక్రవారం యాదగిరి మరణవార్తతో వారింట్లో విషాదం నెలకొంది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పింఛన్ల కోసం వృద్ధుల ఆందోళన
జక్రాన్‌పల్లి: పింఛన్లు రావడం లేదని సోమవారం మండలంలోని మునిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో వృద్ధులు ఆందోళన నిర్వహించారు. గ్రామంలో చాలా మందికి పింఛన్లు రాలేదని పేర్కొంటూ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. సర్పంచ్ సాయన్న,ఉపసర్పంచ్ రమేష్‌లను ఇరవై నిమిషాల పాటు గదిలో నిర్బం ధించి నిరసన వ్యక్తం చేశారు. అర్హులైనప్పటికీ తమకు పింఛన్ జాబితాలో పేరు లేదని వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో చాలా మంది పింఛన్లను అధికారులు తొలగించారని ఆరోపించారు. అర్హులైన తమకు పింఛన్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.