తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీకి సీఎం కేసీఆర్ ప్రాధాన్యత
వివరాల సేకరణలో నిమగ్నమైన ప్రభుత్వ యంత్రాంగం
లక్షలోపు పంట రుణాల మాఫీకి
తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు.. రాష్ర్ట స్థాయి బ్యాంకర్లతో నేడు
సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం
బ్యాంకర్లు ఇచ్చే వివరాల ఆధారంగా కేబినెట్‌కు ఫైలు
మొత్తం వ్యవసాయ రుణాలు: 39,994 కోట్లు
ఇందులో లక్షలోపు రుణాలు: 26,020 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ మాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. లక్షలోపు పంట రుణాల మాఫీపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో రైతాంగమంతా రుణ మాఫీ కోసమే ఆశగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. తెలంగాణలో రైతులకు ఇచ్చిన రుణాల మొత్తం, అందులో లక్ష రూపాయలలోపు రుణం తీసుకున్న వారి సంఖ్య, రుణ మాఫీతో ఆర్థికంగా ప్రభుత్వంపై పడే భారం, దీన్ని అధిగమించేందుకు పరిష్కార మార్గాలు తదితర అంశాలపై కసరత్తు మొదలైంది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. రైతులకు రుణాలిచ్చిన బ్యాంకర్లతో బుధవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి కూడా హాజరుకావాలని మొదట భావించినా.. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ముందు అధికారుల స్థాయిలో సమీక్షా సమావేశం జరిగిన తర్వాతే ఈ అంశంలో స్పష్టత వస్తుందని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ బాధ్యతను సీఎస్‌కు అప్పగించినట్లు సమాచారం.
సాధారణ ఎన్నికల సమయంలో రైతుల రుణ మాఫీ హామీని కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఘన విజయం సాధించి కొత్త రాష్ర్టంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా రుణ మాఫీని అమలు చేయడానికి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రైతులు బ్యాంకుల నుంచి వివిధ రకాలుగా రుణాలు పొందారు. నేరుగా పంట రుణాలు, వ్యవసాయం కోసం బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దీర్ఘకాలిక రుణాలుగా మార్చినవి(సీసీఏటీఎల్), పరోక్ష రుణాలు వంటివి ఉన్నాయి.
తెలంగాణలో దాదాపు 20 నుంచి 25 లక్షల రైతు కుటుంబాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు అంచనా. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ. 7 వేల కోట్లకుపైగా మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ.. భారీగా ఉన్న రైతు రుణాలను ఒక్కసారిగా మాఫీ చేయడం కత్తి మీద సాము వంటిదేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రుణ మాఫీ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. తెలంగాణలో రైతులకు ఇచ్చిన మొత్తం రుణాలు రూ. 39,994 కోట్లుగా అంచనా.

ఇందులో లక్ష రూపాయలలోపు తీసుకున్న రుణాల మొత్తం రూ. 26,020 కోట్ల వరకు ఉంటుందని సర్కారు గుర్తించింది. చిన్న, సన్నకారు అనే తేడా లేకుండా లక్ష రూపాయలలోపు రుణం తీసుకున్న వారందరి అప్పులు మాఫీ అవుతాయన్న ఆశతో రైతులు ఉన్నారు. బుధవారం నాటి సమీక్షా సమావేశంలో బ్యాంకర్లు అందించే వివరాల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. ఆ తర్వాతే పూర్తి వివరాలను తొలి కేబినేట్ భేటీలో కేసీఆర్ ముందుంచనున్నట్లు సమాచారం. ఈ అంశంపై రాష్ర్ట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సచివాలయంలో మంగళవారం పొద్దుపోయే వరకు చర్చించినట్లు తెలిసింది. రైతుల రుణాలకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి...