యాచారం, న్యూస్‌లైన్: అయ్యో పాపం అనేవాళ్లే గాని అన్నదాతను ఆదుకునే వారే లేరు. అది చేస్తాం... ఇది చేస్తామని ఉత్తుత్తి హామీలివ్వడమే తప్ప కనీసం వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలోని యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మంచాల, చేవెళ్ల, షాబాద్ తదితర మండలాల్లో గత పదిరోజుల క్రితం వడగళ్లు, అకాల వర్షంతో పంటలకు విపరీతంగా నష్టం జరిగింది. చాలా గ్రామాల్లో కూలీల కొరతతో వరి పంట కోతల్లో జాప్యం జరిగింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం వడగళ్లు కురిసి వందలాది ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, మల్కీజ్‌గూడ, తాడిపర్తి తదితర గ్రామాల్లో దాదాపు రెండువేలకు పైగా ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది.
దాదాపు ఏడువందల మందికి పైగా రైతులు రూ.లక్షల్లో పెట్టుబడులు నష్టపోయారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలు పార్టీల నాయకులతో పాటు జేడీఏ, రెవెన్యూ, ఈజీఎస్ అధికారులంతా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నాయకులైతే అయ్యో రైతుకు ఎంత నష్టం వాటిల్లింది అని విచారం వ్యక్తం చేశారు. పోయిన పంట పోయింది... మిగిలిన పంటను ఉపాధి హామీ పథకం కూలీలతో సేకరించేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని, పరిహారం అందించేందుకు కృషి చేస్తామని నమ్మబలికి వెళ్లిపోయారు. అయితే ఇప్పటివరకు కూడా పంట కోతల విషయమై, పరిహారం చెల్లింపునకు సంబంధించి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. సర్పంచ్‌లు, ఈజీఎస్ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కనీసం పంట నష్టం వివరాలు కూడా అధికారులు నమోదు చేయకపోవడంతో పరిహారంపై రైతులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
రైతులే రంగంలోకి...
వారం రోజులైనా ఉపాధి కూలీలతో పంట కోత పనులు ప్రారంభించకపోవడంతో రైతులు స్వయంగా రంగంలోకి దిగారు. నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పుట్ల కొద్ది ధాన్యం నేలపాలైంది. ఎంతో కొంత దక్కకపోతుందా అన్న ఆశతో కూలీలతో చెరి సగం చొప్పున ఒప్పం దం చేసుకొని నేలరాలిన ధాన్యాన్ని సేకరించుకుంటున్నారు. ఇదే ఒప్పందంపై పశుగ్రాసం కూడా కోయించుకుంటున్నారు. ఇక మామిడి, పూల, పండ్ల రైతుల పరస్థితి కూడా ఇలాగే ఉంది. రాలిన మామిడి కాయలను ఏరుకుని ఎంతకో కొంతకు అమ్ముకుంటున్నారు. త్వరలో కొలువుదీరన్ను కొత్త ప్రభుత్వమైనా స్పందించి తమను ఆదుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
వడగళ్ల వర్షంతో పంటలకు నష్టం
Published Mon, May 19 2014 12:12 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement