రైతులకు అన్యాయం జరగనివ్వం | farmers Injustice trs Government Favor | Sakshi
Sakshi News home page

రైతులకు అన్యాయం జరగనివ్వం

Published Sun, Aug 24 2014 2:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రైతులకు అన్యాయం జరగనివ్వం - Sakshi

రైతులకు అన్యాయం జరగనివ్వం

  చందంపేట :‘‘రైతులకు అనుకూలంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ చెప్పిండు...ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగనివ్వం, ముంపు బాధిత రైతు కుటుంబాలకు న్యాయమైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తా’’ అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పథకంలో భాగంగా చందంపేట మండలం నక్కలగండి తండా వద్ద 7.64 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రతిపాదిత స్థలాన్ని శనివారం ఆయన సందర్శించారు. రిజర్వాయర్ పరిధిలో నక్కలగండి, తెల్దేవరపల్లి, మోత్యాతండాలకు చెందిన 170 ఎకరాలు, లింక్ కెనాల్ నిర్మాణంలో 65 ఎకరాలు ముంపునకు గురయ్యే బాధితులకు చెల్లింపులు కొలిక్కిరాకపోవడంపై రైతులు మంత్రికి వివరించారు. ఇన్‌టెక్‌వెల్‌పాయింట్ ప్రదేశంలో ఎస్‌ఎల్‌బీసీ ఇంజినీరింగ్ అధికారులు మ్యాప్‌ల ద్వారా రిజర్వాయర్ నిర్మాణ విషయాలను వివరించారు.
 
 పనులు నిలిచిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. 2008లో సర్వే జరిపి భూసేకరణ ప్రకారం కాకుండా ప్రస్తుతం మార్కెట్ విలువను బట్టి పరిహారం ఇప్పించాలని కోరారు. తమకు కూడ కొత్త రేట్లు ఇవ్వాలని, ఇప్పటికే పరిహారం తీసుకున్న బండింగ్ నిర్మాణ ముంపు బాధితులు విజ్ఞప్తి చేశారు. ముంపునకు గురయ్యే 3600 ఎకరాల్లో 726 ఎకరాలు నల్లగొండ జిల్లా పరిధిలోనివి కాగా, మిగతా భూమి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు సంబంధించి నవని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పెద్ద, చిన్న మొక్కలని తేడా లేకుండా బత్తాయి రైతులందరికీ పరిహారం సమానంగా ఇవ్వాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి కొత్త రేట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆ తర్వాత మంత్రి మన్నెవారిపల్లి వద్ద సొరం గం మొదటి దశ పనులను పరిశీలించారు.
 
 ఈ సందర్భంగా  కాంట్రాక్టర్ మాట్లాడుతూ రెండు నెలలుగా చెల్లింపులు జరగక కరెంట్ తొలగించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ.35కోట్లు చెల్లించాలని కోరారు. ఆ తర్వాత సిద్దాపూర్ వద్ద మిడ్‌డిండి ఆన్‌లైన్ పనులను, పాకాల-జూరాల ఎత్తిపోతలకు కామన్ రిజర్వాయర్‌గా ఉపయోగించుకునే అవకాశాన్ని ఇంజినీర్లు వివరిం చారు. మంత్రి వెంట దేవరకొండ, మునుగోడు ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ కృష్ణారావు, ఎస్‌ఈ రాజు, ఈఈ దేవేందర్‌రెడ్డి, డిండి లిఫ్ట్ స్కీంల ఇంజినీర్ నరేందర్‌రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎన్.సత్తయ్య, ఇంద్రసేనారెడ్డి, జూరాల పాకాల ఇంజినీర్ రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కేతావత్ లాలునాయక్, సుధీర్‌రెడ్డి, డి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, గాజుల ఆంజనేయులు, పాండునాయక్ పాల్గొన్నారు.
 
 తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌కే సాధ్యం
 డిండి : తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌కే సాధ్యమని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం శ్రీశైలం సొరంగ పనులు, మిడ్‌డిండి నిర్మించే ప్రాంతం సందర్శించిన అనంతరం డిండికి చేరుకున్నారు. ఐబీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు.  తెలంగాణ పదం ఉచ్చరించని పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశాయన్నారు. సీమాంధ్ర నాయకులు నిధులు కేటాయించక పోవడం వల్లనే తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు సాగలేదన్నారు. దీంతో తెలంగాణ ఎడారిగా మారిందన్నారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యల నివారణకు 24 గంటలు నీరందించేందుకు, పారిశ్రామికాబివృద్ధికి విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీటితో 20ఏళ్ల యువకులు కూడా 60ఏళ్ల ముసలి వాళ్లుగా మారుతున్నారని, దేవరకొండ నియోజకవర్గంలో గిరిజనులు బీదస్థితిలో ఆడపిల్లలను అమ్ముకునే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు డిండి ఎత్తిపోతల నిర్మాణం, మిడ్‌డిండి నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసమే ఈ పర్యటనకు వచ్చానన్నారు. నిపుణులతో చర్చించి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. డిండి ఎత్తిపోతల పరిపాలన అనుమతితోపాటు మిడ్‌డిండి నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement