సాక్షి, హైదరాబాద్ : పల్లె దిగాలుగా పట్నం బాట పట్టింది. కూలి అడ్డాల్లో పనుల కోసం తండ్లాడుతోంది. రైతులు, వ్యవసాయ కూలీలు వలస వచ్చినా పట్నంలోనూ చేతినిండా పనుల్లేవు. ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలవుతున్నా ఇరవై మూడు జిల్లాల్లో వర్షాల జాడలేదు. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయ పనులు ముం దుకు సాగడంలేదు. దిక్కుతోచని స్థితిలో రైతులు, వ్యవసాయ కూలీలు నగరానికి చేరుతున్నారు. ఫలితంగా నగరంలో ఏ కూలి అడ్డా చూసినా రైతులు, వ్యవసాయ కూలీలతో కిటకిటలాడుతోంది. వారంతా భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, హోటళ్లలో సర్వర్లుగా చేరిపోతున్నారు. వర్షాలు వచ్చి పొలం పనులు ముందుకు సాగే వరకు తమకు కష్టాలు తప్పవని, పిల్లల చదువులు, ఇతర ఖర్చుల కోసమైనా ఊరును వదిలిరాక తప్పలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు.
అయితే, తాజాగా వలస వచ్చిన రైతు కూలీల్లో అత్యధికులు భవన నిర్మాణ కార్మికులుగా, కాస్త రాయటం, చదవటం వచ్చినవారు సెక్యూరిటీ గార్డులుగా, స్టోర్ కీపర్లుగా పనులకు కుదిరిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఎర్రకుంట పరిధిలోని సురేష్‌నగర్ ఊరుకుఊరే నగరానికి వచ్చేసింది. ఈ ఊరిజనమంతా అశోక్‌నగర్‌లోని విక్టోరియా కేఫ్ అడ్డాపై కూలి పనుల కోసం వచ్చి పోయేవారి చుట్టూ చేరి ప్రాధేయపడుతున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. అయితే, తమకు కాలం గడిచేందుకు ఏ పనిచెప్పినా చేస్తామని, అవసరమైతే ఎక్కువ సమయమైనా పనిచేస్తామని రైతులు, కూలీలు నగరవాసులకు ఆఫర్ ఇస్తుండటం విశేషం.
23 జిల్లాల్లో వానల్లేవు...
తెలంగాణ జిల్లాల్లో కేవలం ఒక్క నారాయణపేట జిల్లాలోనే సాధారణ సగటుకు మించి వర్షపాతం నమోదైంది. ఏకంగా 23 జిల్లాల్లో దారుణ పరిస్థితులుండగా అందులో ఖమ్మం, మంచిర్యాల, సూర్యాపేట, భద్రాద్రి–కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో అత్యల్ప వర్షం కురిసింది. రైతులు, కూలీల దైన్యం వారి మాటల్లో...
వానలు లేక.. పనుల కోసం
మాది బాన్సువాడ, నాకు రెండెకరాల పొలం ఉంది. వర్షాలు పడతాయని ఎంతో ఆశతో వరిపంటకు ఏర్పాట్లు చేసుకున్నాను. వానలు కురుస్తాయని ఎదురు చూశాను. కానీ, వర్షం పడే సూచనలు కనపడలేదు. దీంతో పంటకు చేసుకున్న ఏర్పాట్లు వృథా అయ్యాయి. చేసేది లేక పట్నం వచ్చి కూలి పనులు చేసుకుంటున్నాను.
– సంజీవ్, బాన్స్‌వాడ
కౌలు రైతుకు కష్టాలే...
పోయినేడాది కౌలు చేస్తే వర్షాల్లేక పంటలు పండలేదు. 10 రోజుల కింద వచ్చి గచ్చిబౌలి సిద్ధిఖీనగర్‌లో ఉంటున్నం. నా భార్య, నేను కూలీ పనులు చేస్తేనే ఇల్లు గడుస్తది. నా కొడుకు పాండురంగ బీటెక్ చేసినా మూడేళ్లుగా ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నడు. కూలీ పనుల కోసం ఇక్కడికొస్తే వారంలో 3 రోజులు ఖాళీగా ఉంటున్నం.
–సల్లూరి అబ్బాయి, వీరాపురం, భూపాలపల్లి
10 రోజులకు 3 రోజులే పని
మాది మహబూబాబాద్ జిల్లా. నాకు మూడెకరాల పొలం ఉంది. పత్తి, మిర్చి, మొక్కజొన్న, కంది పండించేవాడిని. వర్షాలు కురవకపోవడంతో వలస వచ్చిన. బండమైసమ్మనగర్‌లో భార్యతో ఉంటున్న. ఇంటి కిరాయి రూ.3 వేలు. ఇద్దరి పిల్లలను మా అమ్మ దగ్గర పెట్టి వచ్చినం. అడ్డా మీద 10 రోజులు నిలబడితే మూడ్రోజులే పని దొరికింది. ఇక్కడ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
ఊళ్లె బత్కలేక.. పట్నం వొచ్చిన..
రెండెకరాల చెలక ఉంది. వానల్లేక, ఊళ్లో బత్కలేక వలస వచ్చిన. గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో భార్యతో కలసి ఉంటున్న. చిన్న కొడుకు అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటుండు. ఆపరేషన్ చేయించినం. మందులకు పైసలు పంపిస్తున్నం. డిగ్రీ చేసిన పెద్ద కొడుకు జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండు.
– బి.శ్రీనివాస్. పాడిపల్లి, నారాయణపేట్
అడ్డా మీద గంటల తరబడి...
నా కూతురు డిగ్రీ, కొడుకు పది చదువుతున్నరు. ఊర్లో కూలి పనుల్లేవ్. రెండ్నెల్ల క్రితం అంజయ్యనగర్‌కు వచ్చి భార్యతో కలసి కూలీకి వెళుతున్న. ఇద్దరికీ రోజూ కూలి దొరికితే వెయ్యి రూపాయలు వస్తయి. ఒక్కోరోజు ఒక్కరికే కూలి దొరుకుతుంది. పని కోసం అడ్డాపై నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తున్నం.
– ఉప్పరి నారాయణ. గోపన్‌పల్లి, దేవరకద్ర
Comments
Please login to add a commentAdd a comment