ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లా రైతాంగం నాలుగేళ్లుగా వాతావరణం సహకరించక అతివృష్టి, అనావృష్టితో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది అన్నదాతలు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. జూన్ మొదటి వారం లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి తొలకరి చినుకులు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ ప్ర కటించడంతో రైతులు ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యా రు. వ్యవసాయ భూముల్లో చెత్త ఏరివేయడం, తుక్కు కాలబెట్టడం, ట్రాక్టర్, ఎడ్లబండ్ల ద్వారా నేలను చదును చేయడం, సేంద్రీయ ఎరువులతో సారవంతం చేయ డం, దుక్కులు దున్ని భూములు సిద్ధం చేస్తున్నారు.
రైతుల అరిగోస
నాలుగేళ్లుగా ఖరీఫ్ పంటలపై ఆశలు పెట్టుకుని సాగు చేసినా నిరాశ ఎదురవుతోంది. అతివృష్టి, అనావృష్టి అతలాకుతలం చేస్తోంది. కనీసం పరిహారం కూడా అందకపోవడం, పండిన పంటలకు మద్దతు ధర కూడా దక్కక పోవడం, దీనికితోడు ఎరువులు, విత్తనాల ధరలు, కూలీల ధరలు రెట్టింపు కావడంతో తీవ్ర నష్టాలు చవి చూశారు. నాలుగేళ్ల కాలం కలిసిరాక పంట దిగుబడి రాక, నష్టపోయిన పంటకు పరిహారం అందక, చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటలు అనేకం ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయన్ని నమ్ముకుని 4.50 లక్షల మంది రైతులు బతుకుతున్నారు. ఈ ఖరీఫ్‌లో 6.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
పెట్టుబడి భారం
ఒకవైపు ప్రకృతి.. మరోవైపు మద్దతు ధర కరువు, కూలీలు, విత్తనాలు, రసాయనిక ఎరువులు, యంత్రాల ఖర్చులు అధికంగా పెరుగుతూనే ఉన్నాయి. పండిన పంటకు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్తే ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించి నష్టాలను చవిచూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మహిళా కూలీకి రూ.75, పురుషులకు రూ.100 ఉండగా, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.250కు పెరిగింది. యూరియా బ్యాగు రూ.280 నుంచి రూ.500, పొటాష్ రూ.350 నుంచి రూ.900, డీఏపీ రూ.550 నుంచి రూ. 1200, జింక్ రూ.200 నుంచి రూ.350 పెరిగింది.
పత్తి విత్తనం బ్యాగు రూ.620 ఉండగా రూ.930 పలుకుతుంది. సోయా రూ.4,350 ఉండగా ప్రస్తుతం రూ.7,800కు చేరింది. ఈ ఖరీఫ్‌పై రైతులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కాలం కలిసివస్తే ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు బ్యాంకర్లు సకాలంలో అందిస్తే వేతనాలు సకాలంలో సాగుకు సరిపడే విత్తనాలు, ఎరువులు అందితే పంటలు దిగుబడి వచ్చి మద్దతు ధర దక్కితే 2014-2015 ఈ ఖరీఫ్‌లోనైనా నాలుగేళ్ల నష్టాల నుంచి కొంత వరకైనా గట్టెక్కుతామని రైతులు భావిస్తున్నారు.
నాలుగేళ్లలో..
జిల్లాలో గత 2010 ఖరీఫ్ సాగులో అతివృష్టి వల్ల 4,383 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. రూ.6 కోట్ల 50 లక్షల వరకు నష్టపోయారు. దీనిలో రైతులు చేసిన అప్పులు తీర్చలేక 46 మంది రైతులు 2011లో అనావృష్టి తో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పంటలు ఎండి కరువు కోరల్లో చిక్కుకున్నారు. 4 లక్షల హెక్టార్ల వరకు పంట ఎండి రూ.190 కోట్ల నష్టాన్ని చవిచూశారు. దీంతో బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేక 33 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
2012 అతివృష్టి వల్ల వేసిన పంటలు నీటి పాలయ్యాయి. 9,734 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. రూ.6 కోట్ల 44 లక్షల పంట నష్టపోయారు. తీవ్ర వర్షభావంతో పంట చేతికి రాక దిగులు చెంది 42 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
2013 అతివృష్టి, భారీ వర్షాల వల్ల 71,742 హెక్టార్లలో పంటలు కొట్టుకుపోయాయి. పంట చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాలు కురువడంతో రూ.64 కోట్ల 33 లక్షల నష్టం వాటిల్లింది. పంటలు నీట మునిగాయి. విత్తనాల ఖర్చులు, ఎరువుల ఖర్చులు తదితర ఖర్చులకు తెచ్చిన అప్పులు కట్టలేక 36 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఖరీఫ్‌కు కాలం కలిసొచ్చేనా?
Published Tue, May 27 2014 1:29 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement