సభలో అభివాదం చేస్తున్న ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్, బీజేపీ నాయకులు
సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర, బోనస్ ప్రకటించకపోవడం వల్ల తెలంగాణరాష్ట్రం ఏర్పడిన నాలుగేళల్లో రాష్ట్రంలో 4,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి తరఫున ‘మార్పు కోసం–బీజేపీ’ పేరిట శనివారం నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేసి వంచించారని విమర్శించారు. గిరిజన రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ను తాను దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో చేర్చానన్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవ్చేలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాల్లో ఎంతో అవినీతి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఎంతోమంది యువకులు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం వారి ఆశలన్నీ నిరాశ చేశాడని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో క్వింటాల్ ధాన్యానికి రూ. 2,080 చొప్పున చెల్లిస్తున్నామని, గడిచిన రెండు నెలల్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇందుకుగాను రైతుల ఖాతాల్లో రూ. 14 వేల కోట్లు జమ చేశామన్నారు. తమ పార్టీఅభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డికి ఓటువేసి గెలిపిస్తే రైతుల కష్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది దళితులుండగా ఇప్పటివరకు 5 వేల మందికి మాత్రమే 3 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేశారన్నారు. పేదప్రజలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు సింగిల్‌బెడ్ రూం ఇళ్లు కూడా కట్టించలేకపోయారని విమర్శించారు. ఒకవైపు నుంచి కేసీఆర్.. మరోవైపు నుంచి మహాకూటమి వస్తుందని, ప్రజలు బీజేపీకి ఓటువేసి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మహాకూటమి తరపున రాహుల్‌గాంధీ ఎక్కడ ప్రచారంచేసినా అక్కడ వారి అభ్యర్థి ఓడిపోతారన్నారు. రాహుల్‌గాంధీ ప్రచారం మహాకూటమి శాపంగా మారుతుందన్నారు. దేశంలో 75శాతం రాష్ట్రాల్లో బీజేపీ పాలన కొనసాగుతుందన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉజ్వల యోజన ద్వారా బీజేపీ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందజేస్తుందని వివరించారు. 2022 నాటికి దేశంలో అందరికీ పక్కా ఇళ్లు ఉండేలా మోడీ నాయకత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో తమపార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఆయూష్మాన్ భారత్ ద్వారా ప్రతిఒక్కరికి రూ. 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. దీంతోపాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతామన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటువేయాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment