హామీలపై ఆశలు | farmers waiting for debt waiver | Sakshi
Sakshi News home page

హామీలపై ఆశలు

Published Thu, May 29 2014 12:33 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

farmers waiting for debt waiver

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు మరో నాలుగు రోజుల్లో కొలువు దీరనుంది. నవ తెలంగాణ నిర్మాణంపై ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. సంపూర్ణ మెజార్టీతో టీఆర్‌ఎస్ పార్టీకి అధికారం దక్కడం, ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై, ఆ పార్టీ మేనిఫెస్టోపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రధానంగా రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ.. పేదలకు రూ.3 లక్షలతో డబుల్ బెడ్‌రూమ్ ప్లాటు.. వృద్ధులు, వితంతులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 పింఛన్ల పెంపు కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. వీటితోపాటు అనేక హామీలు ఇచ్చినప్పటికీ ప్రధానంగా వీటి అమలుపై అందరి ఆసక్తి నెలకొంది.

 ఇదీ పరిస్థితి..
 జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలో ప్రభుత్వం రూ.1,656 కోట్లు పంట రుణాల కింద రైతులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, చివరికి రూ.1,421 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. 3,16,542 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇందులో 2/3 వంతు మంది చిన్న, సన్నకారు రైతులు, ఐదెకరాలలోపు  పొలం ఉన్న రైతులు ఉన్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ రైతులు రూ.లక్షలోపు రుణం తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, గత మార్చిలో రుణం తీసుకున్న రైతులకు 2014 మార్చి 31 వరకు, గత జూన్‌లో రుణం తీసుకున్న రైతులకు 2014 జూన్ 30లోగా రుణాలు చెల్లించిన పక్షంలో వడ్డీమాఫీ ఉంటుంది.

అయితే ఎన్నికల నేపథ్యంలో పార్టీలు రుణమాఫీ ప్రకటించడంతో రైతులు తీసుకున్న రుణం కట్టలేదు. కొంత మంది మాత్రం యథావిధిగా రుణం చెల్లించి వడ్డీమాఫీ పొందారు. ఆ సంఖ్య స్వల్పంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు రూ. లక్షలోపు రుణం తీసుకున్న వారి సంఖ్యను మాత్రం గుర్తించలేదు. కొత్త సర్కారు కొలువుదీరిన అనంతరం ఆదేశాలు వెలువడితే దానిపై కసరత్తు చేపట్టే అవకాశం ఉంది.

 ఇందిరమ్మ, రచ్చబండ ముచ్చట
 జిల్లాలో ఇందిరమ్మ-1,2,3, రచ్చబండ- 1,2,3, పునరావాస ఇళ్లు కలిపి 3,80,787 మంజూరు ఉండగా, 3,45,113 ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగింది. 2,14,912 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. 1,30,201 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటికి ఇది వర్తించకపోవచ్చు. అయితే ప్రభుత్వం మార్గదర్శకాలు ఏలా ఉంటాయో చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ల వ్యయంను పెంచిన పక్షంలో ప్రతినెల రూ.19.95 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది.

 ఇతర హామీలు, జిల్లా పరిస్థితులు
 నీటి పారుదల రంగం పరంగా ప్రతి అ సెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామని టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించారు. దీనిపై రైతులు గం పెడాశలు పెట్టుకున్నారు. కాంట్రాక్టు ఉ ద్యోగులను క్రమబద్దీకరిస్తామన్న కేసీఆర్ హామీపై వేలాది మంది ఆశలు పెట్టుకున్నారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్లు, డిపెండెంట్ ఉద్యోగా ల విధానం అమలు, సింగరేణి ప్రాంతా ల్లో మెరుగైన వైద్యశాలలు, తెలంగాణలో మైనింగ్ యూనివర్సిటీ, కొత్తగా భూగర్భ గనుల తవ్వకం టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించారు. మూతబడ్డ పరిశ్రమలు పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రణాళికలో టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఆదిలాబాద్‌లో సీసీఐ సిమెంట్ కర్మాగారం పునరుద్ధరణకు కేంద్రం సహకారంతో కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు. పర్యాటకంగా జిల్లాలో అనేక జలపాతాలు, కవ్వాల్ అభయారణ్యం, పురాతన కట్టడలైన ఘాట్‌లను అభివృద్ది చేసిన పక్షంలో జిల్లాకు పర్యాటకానికి ఊపునిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement