సాగర్ ఆయకట్టులో.. వారబందీ
మిర్యాలగూడ : సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వారబందీకి అధికారులు ఉపక్రమించారు. ఈ మేరకు ఎన్‌ఎస్‌పీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సాగర్ జలాశయం లో పుష్కలంగా నీరున్నప్పటికీ వారబందీ విధించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉన్న సమయంలో ఎడమ కాల్వకు ఆన్ అండ్ ఆఫ్ విధానంలో 10 రోజుల పాటు నీటిని విడుదల చేసి ఐదు రోజుల పాటు కాలువ నీటిని నిలిపివేయాలని గతంలో నిర్ణయించారు. కానీ అనుకోకుండా కృష్ణా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో జలాశయం నిండింది. దీంతో రైతులు సంతోషంగా వరి నాట్లు వేసుకున్నారు. ఇప్పటికే కాలువ చివరి భూములకు నీరందడం లేదని రైతులు ఆందోళన చెందుతుండగా వారబందీని అమలు చేయాలని నిర్ణయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాలేరు రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపడం కోసమే వారబందీ అని ఎన్‌ఎస్‌పీ అధికారులు పేర్కొంటున్నారు.
పంటలకు కష్టమే..
ప్రస్తుతం ఎడమ కాల్వ పరిధిలో వారబందీ విధానాన్ని అమలు చేస్తే పొట్టదశలో ఉన్న వరి పొలాలకు ప్రమాదం పొంచి ఉంది. ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టుకు నీటిని ఆలస్యంగా విడుదల చేయడంతో వరి నాట్లు కూడా ఆలస్యమయ్యాయి. ఈ మేరకు నవంబర్ 15వ తేదీ వరకు పుష్కలంగా నీరు పారాల్సి ఉంది. కానీ వారబందీ విధానం వల్ల మేజర్ కాల్వల చివరి భూములకు ఇక నీరందడం కష్టంగా మారనుంది. ఇప్పటికే కాల్వ చివరి భూములకు నీరందక రైతులు నానా ఇబ్బందులు పడుతుండగా వారంబందీని అమలు చేస్తే ఇక పంట పొలాలు వదులుకోవాల్సిందేనని రైతులు పేర్కొంటున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం..
సాగర్ కుడి, ఎడమ కాల్వకు చెరో 50 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు ఎడమ కాల్వకు 58.34 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఎన్‌ఎస్‌పీ అధికారులు లెక్కలు చూపుతున్నారు. మొదటి జోన్ పరిధిలో 33 టీఎంసీలు, రెండవ జోన్ పరిధిలో 25.34 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు పేర్కొంటున్నారు. కాగా ఖరీఫ్ సీజన్‌లో పంటలు చేతికి రావడానికి ఇంకా 17 టీఎంసీల నీరు అవసరం ఉందని అధికారులే చెప్పడం గమనార్హం.
రెండు మూడు రోజుల్లో అమలు..
వారబందీ మరో రెండు రోజుల్లో అమలు చేయనున్నారు. అందులో భాగంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మక్త్యాల బ్రాంచి కెనాల్ వరకు(115 కిలో మీటర్లు) మూడు జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్ పరిధిలో వారంలో ఒక రోజు చొప్పున మేజర్ కాల్వలకు ఖరీఫ్ పూర్తయ్యే వరకు నీటిని నిలిపి వేయనున్నారు. కాగా ప్రధాన కాల్వకు నీటి విడుదల యథావిధిగా కొనసాగనుంది.
రైతులు సహకరించాలి
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ముక్తాల బ్రాంచి కెనాల్ వరకు వారబందీ విధానాన్ని అమలు చేయనున్నామని, అందుకు రైతులు సహకరించాలని ఎన్‌ఎస్‌పీ సీఈ పురుషోత్తంరాజు కోరారు. శనివారం స్థానిక ఎన్‌ఎస్‌పీ క్యాంపులోని రైతు శిక్షణ కేంద్రంలో ఎన్‌ఎస్‌పీ, రెవెన్యూ అధికారులు, రైతులు, నీటి సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడమ కాల్వకు ఆన్ అండ్ ఆఫ్ విధానంతో ఒప్పందం ప్రకారం ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజ ర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం 2.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందువల్ల వారంలో ఒక రోజు మేజర్ కాల్వలకు నీటిని బంద్ చేస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనను నీటి సంఘాల ప్రతిని ధులు అంగీకరించారు. వారబందీకి రైతులందరూ సహకరించాలని కోరారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని వజీరాబాద్ మేజర్‌కు డిజైన్ ప్రకారం నీటిని విడుదల చేయడం లేదని, దాంతో కాల్వ చివరి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దామరచర్ల మండలంలో 40 శాతం పంట పొలాలు ప్రస్తుతం బీడుగా ఉన్నాయని, ఎన్‌ఎస్‌పీ అధికారులు క్షేత్ర స్థాయి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలన్నారు. అలాగే 19, 20 ఎత్తిపోతల పథకాలకు కూడా టెండర్లు నిర్వహించి ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరారు. సమావేశంలో ఎన్‌ఎస్‌పీ ఎస్ సుధాకర్, ఈఈ అంజయ్య, దామరచర్ల జెడ్‌పీటీసీ సభ్యుడు శంకర్‌నాయక్, నీటి సంఘాల చైర్మన్లు, రైతు ప్రతినిధులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వీరకోటిరెడ్డి, శ్రీనివాస్, స్వామి పాల్గొన్నారు.