ఎవుసం పనులు ఎంత వరకు వచ్చినయ్
* ఫామ్‌హౌస్‌లో వ్యవసాయ పనులపై ముఖ్యమంత్రి ఆరా
* ఏఏ పంటలు వేయాలో సూచన
జగదేవ్‌పూర్: ‘ఇక్కడ వర్షాలు బాగానే పడినట్లు ఉంది.. ఎవుసం పనులు ఎంత వరకు వచ్చినాయి.. డ్రిప్పు పనులు పూర్తి అయినాయా.. ఎరువులు చల్లడం ఇంకా పూర్తి కాలేదా.. తొందరగా ఎవుసం పనులు మొదలు పెట్టాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం రాత్రి మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఆయన.. రాత్రి ఇక్కడే బస చేశారు.
బుధవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో తన కారులో ఫామ్‌హౌస్‌లో తిరుగుతూ వ్యవసాయ పనులను పర్యవేక్షించారు. గంటన్నరకు పైగా అంతటా తిరిగారు. ఎక్కడెక్కడ ఏఏ పంటలు వేయాలో ఫామ్‌హౌస్ సూపర్‌వైజర్‌కు సూచించినట్లు తెలిసింది. ఎక్కువ శాతం అల్లం పంట పండించడానికి భూమిని చదును చేయాలని సూచించినట్లు సమాచారం. కాన్వాయ్ ద్వారా రోడ్డుకు అవతలి భాగంలో ఉన్న వ్యవసాయ భూమిని పరిశీలించారు. అందులో జరుగుతున్న డ్రిప్పు పనులను పర్యవేక్షించారు. వ్యవసాయ బావి పనులను పరిశీలించారు. కొద్దిసేపు ఇక్కడే ఉండి భోజనం ముగించుకొని మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి తన కాన్వాయ్ ద్వారా హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.
గోపాలమిత్రల ఎదురుచూపులు
సీఎం కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి వచ్చారన్న విషయం తెలిసి బుధవారం ఉదయం వివిధ మండలాలకు చెందిన 30 మందికి పైగా గోపాలమిత్రలు ఇక్కడకు చేరుకున్నారు. గత నెల 24న కూడా గోపాలమిత్రలు ఫామ్‌హౌస్‌కు వచ్చి కేసీఆర్‌కు తమ సమస్యలు తీర్చాలని వినతి పత్రం అందించారు. అయితే ఇప్పటి వరకు స్పందన లేకపోవడంతో మళ్లీ వచ్చామని గోపాలమిత్రల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. రెండు గంటల పాటు వేచి ఉన్నా సీఎంను కలవడానికి వీలులేదని పోలీసులు చెప్పడంతో వెనుదిరిగారు.