గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ
అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్
విధేయతకు గుర్తింపు
సిద్దిపేట జోన్ : సిద్దిపేటకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌కు మరోసారి చాన్స్ లభించింది. టీఆర్‌ఎస్ అధిష్టానం పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించిన విషయం విదితమే. ఈ జాబితాలో గవర్నర్ కోటాలో సిద్దిపేటకు చెందిన ఫారూక్ హుస్సేన్‌కు చోటు దక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక మంత్రి హరీశ్‌రావుతో ఉన్న సాన్నిహిత్యం, గతేడాదిగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా పార్టీలో కొనసాగిన విధేయతకు సీఎం మరో గుర్తింపునిచ్చారు. ఎమ్మెల్సీ బెర్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ఆశించినప్పటికీ ఫారూక్ హుస్సేన్‌ను గవర్నర్ కోటా కింద అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. సిద్దిపేట పట్టణానికి చెందిన ఫారూక్ హుస్సేన్ 30 సంవత్సరాల క్రితం మున్సిపల్ కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయనకు దివంగత నేత వైఎస్ హయాంలో 2004–2007 వరకు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం లభించింది. అనంతరం 2011లో గవర్నర్ కోటా కింద ఉమ్మడి రాష్ట్రంలో ఫారూక్ హుస్సేన్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భా వం చెందడం, అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016 ఏప్రిల్ 25న ఫారూక్ హుస్సేన్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. నాటినుంచి ఏడాదిగా సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఆయన మంత్రి హరీశ్‌రావుతో కలిసి పని చేస్తూ పార్టీలో కొనసాగారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీఎం కలిసి తనకు తిరిగి రెండోసారి అవకాశాన్ని పరిశీలించాలని కోరినట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో ఆయన పదవీకాలం ముగియనున్న సందర్భంగా రాష్ట్రంలోని ఎమ్మెల్సీల భర్తీకి ఆదివారం ఏడుగురి పేర్లతో కూడిన జాబితాను కేసీఆర్ ప్రకటించారు. అందులో గవర్నర్ కోటా కింద ఫారూక్ హుస్సేన్ అభ్యర్థిత్వాన్ని సీఎం ఖరారు చేయడం విశేషం.
ఫారూక్‌కే మళ్లీ చాన్స్..
Published Tue, Mar 7 2017 12:08 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement