వివరాలు సేకరిస్తున్న రూరల్ ఎస్సై జితేందర్
మహబూబాబాద్ రూరల్: తండ్రి, కూతురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ మండలంలోని అనంతారం గ్రామ శివారు, మొగిలిచర్ల గ్రామానికి వెళ్లే దారిలో గల వ్యవసాయ బావి వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మానుకోట జిల్లా కేంద్రంలోని పాతబజార్ నేతాజీ స్కూల్ గల్లీలో బంగారం షాపు నడుపుకునే తుమ్మనపల్లి శివకుమార్ (36)కు భార్య సరిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కళవర్షిత(12) వికలాంగురాలు. శివకుమార్ శనివారం అమావాస్య కావడంతో బంగారం షాపుకు సెలవు ఉండటంతో షాపుకు వెళ్లలేదు.
వీరబ్రహేంద్రస్వామి దేవాలయంలో జరిగిన పరపతి సంఘం, పట్టణంలోని ఓ చిట్‌ఫండ్ కంపనీలో జరిగిన వ్యక్తిగత పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ...పెద్ద కుమార్తె కళవర్షితను తన వెంట తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో మాహబూబాబాద్ మండలంలోని అనంతారం గ్రామ శివారు, కురవి మండలంలోని మొగిలిచర్ల గ్రామానికి వెళ్లే దారిలో గల ఓ వ్యవసాయ బావి పక్కన రెండు మృతదేహాలు ఉన్నట్లు మహబూబాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే రూరల్ ఎస్సై పత్తిపాక జితేందర్ సంఘటన స్థలానికి వెళ్లి వారి వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా తుమ్మనపల్లి శివకుమార్, అతడి కుమార్తె కళవర్షితగా గుర్తించారు. అయితే కుమార్తె కళవర్షితకు కూల్ డ్రింక్ బాటిల్లో బంగారం పనికి సంబంధించిన కెమికల్ కలిపి ఆమెకు తాపించి, తాను మద్యంలో కలుపుకుని తాగి మృతి చెందినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించామని ఎస్సై తెలిపారు. మృతదేహాలను 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి మృతికి గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని ఎస్సై జితేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment