కొడుకు.. మాట వినడం లేదని..
♦ రైలుకిందపడేందుకు యత్నించిన తండ్రి
♦ గమనించి వారించిన ‘సాక్షి’ విలేకరి
వికారాబాద్ రూరల్: రెక్కలుముక్కలు చేసుకొని పెంచుకున్న కొడుకులు మాట వినడం లేదని మనోవేదనకు గురైన ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. రైలు కిందపడేందుకు పట్టాలపైకి వెళ్లగా ‘సాక్షి’ విలేకరి వారించడంతో తన ప్రయత్నం విరమించుకున్నాడు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లికి చెందని అర్జున్(38) దంపతులు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో ఉంటూ తమ ఇద్దరు కుమారులను ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటున్నారు. బాలురిద్దరు హాస్టల్‌లో ఉంటున్నారు.
చిన్న కుమారుడు అనంత్ 6వ తరగతి చదువుతూ చెడుమార్గం పట్టాడు. పాఠశాలకు వెళ్లకుండా డుమ్మా కొట్టడంతో తండ్రి అర్జున్ వారించినా ఫలితం లేకుండా పోయింది. అనంత్ విషయంలో జనం అర్జున్‌కు ఫిర్యాదు చే స్తూ ఆయనను మందలించసాగారు. అర్జున్ కుమారుడి బాగు కోరి హితవు పలికితే.. ‘మీరు నన్ను ఏమైనా అంటే చనిపోతాను..’ అంటూ అతడు తల్లిదండ్రులను బెదిరించసాగాడు. ఏం చేయాలో దిక్కుతోచక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు అర్జున్. సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడేందుకు రైలు పట్టాలపైకి చేరుకున్నాడు.
అదే సమయంలో స్థానిక ‘సాక్షి’ విలేకరి వార్తల సేకరణ కోసం అటుగా వెళ్లడంతో అర్జున్ పట్టాలపై ఏడుస్తూ కనిపించాడు. దగ్గరకు వెళ్లి ఆరా తీయగా భోరున పిలిపించి అనంతరం జరిగిన విషయం చెప్పాడు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని విలేకరి ఆయనకు ధైర్యం చెప్పాడు. తాము రెక్కలుముక్కలు చేసుకొని కొడుకులను చదివిస్తున్నామని, కొడుకు మాట వినడం లేదని, పలువురు అతడిపై తనకు ఫిర్యాదు చేయడంతో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని తన బాధ వెల్లగక్కాడు. అనంతరం అర్జున్‌ను తన భార్యవద్దకు తీసుకెళ్లగా ఇద్దరు కన్నీటిపర్యంతమయ్యారు. కాస్త ఆలస్యమైతే తన భర్త దక్కేవాడు కాదని అర్జున్ భార్య తెలిపింది.