
తెలంగాణ విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో చదువుకునే సీమాంధ్ర విద్యార్థుల ఫీజులు తామెందుకు చెల్లిస్తామని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం శాసనమండలిలో జరిగిన చర్చలో కేసీఆర్ ప్రసంగించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మండలికి వచ్చిన ఆయన తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ కార్యక్రమాలను దాదాపు 2 గంటలకు పైగా వివరించారు.
ఆయన ప్రసంగం అనంతరం పలువురు సభ్యులు కొన్ని వివరణలు కోరగా... అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పారు. శాసనసభలో ఉదయం చేసిన ప్రసంగంలోని అంశాలనే మండలిలోనూ ఆయన ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో హైదరాబాద్‌లో చదివే సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే ప్రసక్తే ఉండదని కుండబద్దలు కొట్టారు. ఈ అంశంపై నిపుణులతో చర్చించి పకడ్బందీ ఫీజుల పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. నిమ్స్ తరహాలో జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, అప్పటి వరకు ఆరోగ్యశ్రీని కొనసాగిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను విడతల వారీగా రద్దు చేసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, భేషజాలకు పోకుండా అన్ని పార్టీలను కలుపుకొని పోతామని పేర్కొన్నారు. సభలో కేసీఆర్ మాట్లాడుతున్నంత సేపు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా అన్ని పక్షాల సభ్యులు శ్రద్ధగా విన్నారు.