మృత్యువు ‘ఉచ్చు’ బిగిస్తోంది! | Female tiger on the edge of death in the forest of Chinnur Reserve | Sakshi
Sakshi News home page

మృత్యువు ‘ఉచ్చు’ బిగిస్తోంది!

Published Sat, Jul 7 2018 2:03 AM | Last Updated on Sat, Jul 7 2018 2:03 AM

Female tiger on the edge of death in the forest of Chinnur Reserve - Sakshi

ఉచ్చు కారణంగా నడుముకు అయిన గాయంతో అడవిలో సంచరిస్తున్న పులి

వేటగాళ్ల ఉచ్చుకు తీవ్రంగా గాయపడిన ఓ పెద్ద పులి మృత్యువు అంచుకు చేరుకుంటోంది. ఎదిగే దశలో ఉన్న పులి కావడంతో నడుముకు చుట్టుకున్న తీగలాంటి ఉచ్చు మరింత బిగుసుకుపోతోంది. మంచిర్యాల జిల్లా పరిధిలోని చెన్నూరు రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో సంచరిస్తున్న ఆడ పులిని బంధించి ఉచ్చు నుంచి విముక్తి కల్పించేందుకు రాష్ట్ర అటవీ యంత్రాంగం 3 నెలల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అడవిలో అమర్చిన కెమెరా ట్రాప్‌లకు చిక్కిన పులి తాజా చిత్రాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 

గతేడాది జనవరి నుంచి.. 
మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం నుంచి మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్‌ అభయారణ్యానికి పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న చెన్నూ రు, కాగజ్‌నగర్‌ ఫారెస్టు డివిజన్లకు టైగర్‌ కారిడార్లుగా పేరుంది. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో సంచరిస్తున్న ఫాల్గుణ అనే ఆడ పులి దాదాపు రెండున్నరేళ్ల కింద మూడు మగ, ఒక ఆడ కూనలకు జన్మనిచ్చింది. ఈ కూనలకు కే–1, కే–2, కే–3, కే–4గా అప్పట్లో అటవీ శాఖ పేర్లు పెట్టింది. వీటి లో మూడు మగ పిల్లలు చాలాకాలంగా జాడలేకుండా పోయాయి. నడు ముకు బిగుసుకున్న ఉచ్చుతో సంచరిస్తున్న ‘కే–4’ఆడ పులి మాత్రం గతేడాది జనవరిలో చెన్నూరు అడవిలో కెమెరా ట్రాప్‌లకు చిక్కింది.  ఉచ్చుతో పెద్దగా ప్రమాదం లేదను కున్న అటవీ శాఖ మిన్నకుండిపోయింది. 

వలస వెళ్లిపోతే మరింత కష్టం 
పులి చెన్నూరు దాటి ఎక్కువ దూరం వలస వెళ్లిపోతే బంధించడం కష్టంగా మారుతుందని జం తు సంరక్షణ సంస్థల కార్యకర్తలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. వర్షాలు ప్రారంభమైతే రెస్క్యూ ఆపరేషన్‌ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. మరోవైపు కే–4 పులికి జన్మనిచ్చిన ఆడపులి ఫాల్గుణ కాగజ్‌నగర్‌ అడవిలో ఇటీవల మరో మూడు కూనలకు జన్మనిచ్చింది. వేటగాళ్ల బారి నుంచి వీటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

ఫలించని రెస్క్యూ ఆపరేషన్‌ 
ఎదిగే పులి కావడంతో నడుముకు ఉచ్చు బిగుసుకుపోయి ప్రమాదకరంగా మారుతోందని గుర్తించిన అటవీ శాఖ ఎట్టకేలకు గత మార్చిలో రక్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. కవ్వాల్‌ పులుల అభయారణ్య ఫీల్డ్‌ డైరెక్టర్‌ సి.సర్వనన్‌ నేతృత్వంలో ముగ్గురు పశు వైద్యులు, ఓ డీఎఫ్‌ఓ, మరో ఎన్జీఓతో కమిటీని ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్‌ బాధ్యతలు అప్పగించింది. తొలి ప్రయత్నంగా చెన్నూరు అడవిలో బోను ఏర్పాటు చేసి ఎరగా ఎముకలు వేయగా, పులి దరిదాపుల్లోకి రాలేదు. ఆ తర్వాత మూడు నాలుగు చోట్ల బోనులో పశువులను కట్టి ఉంచినా ఫలితం రాలేదు. కేంద్ర మంత్రి మనేకా గాంధీకి విషయం తెలియడంతో పులిని బంధించేందుకు ఆమె ఓ ప్రొఫెషనల్‌ హంటర్‌ని పంపించారు. కెమెరా ట్రాప్స్‌లో పులి చిత్రాలను చూసిన హంటర్‌ కూడా గా యం తగ్గిందని, రెస్క్యూ చేయాల్సిన అవసరం లేదని రెండు నెలల కింద తేల్చి వెళ్లిపోయాడు. తాజాగా కెమెరా ట్రాప్‌కు చిక్కిన పులి చిత్రాల్లో ఉచ్చు వల్ల నడుముకు రెండు వైపుల కోసుకుపోయి తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు. వేట కోసం పులి లంఘిస్తున్న క్రమంలో గాయం పెద్దదిగా మారుతోంది.
మహమ్మద్‌ ఫసియుద్దీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement