
టీఆర్‌ఎస్ శ్రేణుల బాహాబాహీ
హసన్‌పర్తి : టీఆర్‌ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. మా వర్గాని కంటే.. మా వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి సమావేశపు ఆవరణలో వేసిన కుర్చీలతో దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఘర్షణ పడ్డారు. ఈ ఘటన హసన్‌పర్తి మండలం అన్నాసాగరంలో మంగళవారం జరిగింది. అన్నాసాగరం టీఆర్‌ఎస్ గ్రామశాఖతోపాటు అనుబంధ సంఘాల కమిటీలు వేయడానికి హన్మకొండ మండలానికి చెందిన ఆ పార్టీ నాయకుడు చింత రమేష్ ఎన్నికల పరిశీలకుడిగా వచ్చారు. ఇప్పటికే గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకులు మూడు వర్గాలుగా ఏర్పడ్డారు. తాజా మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు గడ్డం సమ్మయ్య, సీనియర్ నాయకులు ఐలయ్యతోపాటు ఆరుగురు వార్డు సభ్యులు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.
సీనియర్ నాయకులు, పార్టీకి అంకితమై పనిచేస్తున్నవారు ఉన్నందున ఎన్నిక జరపడానికి పరిశీలకుడు మొగ్గుచూపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. చివరికి ఒకరినొక రు నెట్టుకుంటూ కుర్చీలు లేపారు. ఒక వర్గం వైపు మరో వర్గం దాడి చేయడానికి దూసుకొచ్చింది. ఈ ఘటనతో హతాశుడైన ఇన్‌చార్జి కమిటీల ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని పరిశీలకుడు చింత రమేష్ తెలిపారు.