ఔటర్‌పై అంబులెన్స్ దగ్ధం
మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబీకులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
శంషాబాద్ (రాజేంద్రనగర్): ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ అంబులెన్స్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ వద్ద ఔటర్ రింగురోడ్డుపై జరిగింది. హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో నివాసముంటున్న గంటలూరి వెంకట సుబ్బరాజు (55) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సొంతూరులో అంత్యక్రియలు చేయడానికి అతని కుమారుడు శ్రీనివాస్ రాజుతో పాటు మరో ముగ్గురు శుక్రవారం ఉదయం అంబులెన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి బయలుదేరారు.
ఉదయం 10.20 గంటలకు కొత్వాల్‌గూడ చెన్నమ్మ హోటల్ సమీపంలోకి వచ్చేసరికి అంబులెన్స్‌లో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై వారు వాహనంలోనుంచి దిగేశారు. మృతదేహాన్ని కూడా బయటకి తీశారు. క్షణాల్లో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. ఔటర్‌పై ఉన్న గస్తీ పోలీసులు ఫైరింజన్‌ను రప్పించి మంటలు ఆర్పించారు. పోలీసులు మరో వాహనం ఏర్పాటు చేయడంతో బాధితులు అందులో వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.