
ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్: గన్‌ఫౌండ్రీ డివిజన్‌లోని ఫతే మైదాన్ క్లబ్‌కు ఎదురుగా ఉన్న ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభ వించింది. ఎనిమిదంతస్తుల భవనంలో ఐదవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని 5, 6, 7 అంత స్తులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఖాజా మొయినుద్దీన్ అనే వ్యక్తికి స్వల్ప గాయాల య్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీ ఆస్తినష్టం వాటిల్లింది. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని పోలీసులు కాపాడారు. ప్రముఖ ఉర్దూ దినపత్రిక అధినేత ఖాన్ లతీఫ్ ఖాన్‌కు చెందిన ఈ భవనంలో అన్నీ వాణిజ్య సముదాయాలే ఉన్నాయి.
ఇదే భవనం నుంచి ఉర్దూ దినపత్రిక మున్సిఫ్‌ను నడుపుతున్నారు. బుధవారం భవనంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానిక అబిడ్స్ ఠాణా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది భవనంలో ఏర్పాటు చేసిన ఫైర్ నెట్‌వర్క్ ద్వారా మంటలను ఆర్పేందుకు యత్నించగా ఫలించలేదు. ఆక్సిజన్ సిలిండర్లు తెరుచుకోకపోవడంతో మంటలు మరిన్ని అంతస్తులకు వ్యాపించాయి. మొత్తం 14 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఒక్కసారిగా మంటలు రావడంతో..
భవనంలో కార్పొరేట్ స్థాయి కార్యాలయాలు, సెల్‌ఫోన్ షోరూమ్స్, కంటి అద్దాల దుకాణాలు, వస్త్ర దుకాణాలు, సెల్‌ఫోన్ల కంపెనీలతోపాటు కాల్‌సెంట ర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనంలో ఐదవ అంతస్తులో అడ్వాంటేజ్ వన్ కాల్‌సెంటర్ ఉంది. ఈ కార్యాలయంలో బుధవారం ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటలు, పొగ వ్యాపించడంతో భయపడిన ఉద్యోగులు కిందకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన ఒకరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏసీలో వచ్చిన షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు.
యాజమాన్యానికి నోటీసులు..
భవనంలోని 5, 6, 7 అంతస్తులను సీజ్ చేశామని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ తెలిపారు. భవనానికి ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేనట్టుగా ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు. భవనానికి సంబంధించిన నిర్మాణ అనుమతి పత్రాలు, భద్రత, ఫైర్ ఎన్‌ఓసీ, చేపట్టిన భద్రతా చర్యలపై గురువారం ఉదయంలోగా వివరణ సమర్పించాలని భవన యాజమాన్యానికి నోటీసులు అందించామన్నారు. భవనంలో అమర్చిన ఫైర్ నెట్‌వర్క్ పనిచేయకపోవడం వల్లే భారీ ఆస్తినష్టం వాటిల్లిందని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ఈ మార్గంలో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం ఏర్పడింది. ఇక ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఐడియాతో పాటు మరికొన్ని నెట్‌వర్క్‌లు కొన్ని గంటల పాటు పనిచేయలేదు. రాత్రి 7.30 తర్వాత వీటి సేవలను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment