మధిర: ఖమ్మం జిల్లాలో తొలి మంత్రి పదవి మధిర నియోజకవర్గానికే దక్కింది. 1964లో శాసనమండలికి ఎన్నికైన శీలం సిద్ధారెడ్డి 1967వ సంవత్సరంలో కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్‌లో భారీ నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన ఆయన 1947–48లో ఆయన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోసవీడు క్యాంపు ఇన్‌చార్జ్‌గా ఉండి నిజాం ప్రభుత్వంపై పోరాటం నిర్వహించారు. నాటి హైదరాబాద్ స్టేట్‌లో 1949నుంచి 1952 వరకు మధిర తాలూకా కాంగ్రెస్‌పార్టీ కార్యదర్శిగా, 1958నుంచి 1962వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1963నుంచి 1967వరకు పీసీసీ కార్యదర్శిగా, 1964నుంచి 2004వరకు ఏఐసీసీ సభ్యునిగా పనిచేశారు. 1958లో ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలి కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
1964 సంవత్సరంలో ఆప్కాబ్ తొలి చైర్మన్‌గా ఎన్నికై అదే సంవత్సరం రెండోసారి శాసన మండలికి ఎన్నికయ్యారు. అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో జిల్లా నుంచి తొలిమంత్రిగా పనిచేశారు. 1970లో మూడో సారి శాసనమండలికి ఎన్నికై పీవీ నర్సింహారావు మంత్రి వర్గంలో 1972వరకు నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేశారు. 1983లో మధిర ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. చివరగా 1998 మధిర ఉప ఎన్నికల్లో కూడా పోటీచేసి నాటి సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్యచేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు.
కమ్యూనిస్టులతో రాజీలేని పోరు
అనేక దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో సిద్ధారెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించేస్థాయికి ఎదిగారు. ముక్కుసూటిగా వ్యవహరించే తొలిమంత్రి సిద్ధారెడ్డి రాజీలేని మనస్తత్వంతో పనిచేయడంవల్ల అప్పట్లో ముఖ్యమంత్రి పదవినికూడా వదులుకున్నారని ఆయన స్నేహితులు చెబుతుంటారు. 1972లో ఆయన రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ఆ పార్టీలో ముఖ్యపాత్ర పోషిస్తున్న శీలం సిద్ధారెడ్డికి ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని ఇందిరాగాంధీ తనదూత పీవీ నర్సింహారావు ద్వారా రాయభారం పంపగా, ఆయన ముఖ్యమంత్రి పదవిని నిరాకరించినట్లు చెబుతారు. నిబద్ధత కలిగిన కాంగ్రెస్‌వాదిగా సిద్ధారెడ్డి సుదీర్ఘకాలం రాజకీయ కురుక్షేత్రంలో పనిచేశారు. ఒకవైపు సొంత పార్టీలోనూ, మరోవైపు జిల్లాలోని కమ్యూనిస్టులతో రాజీలేని పోరాటంచేసి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే సిద్ధారెడ్డికి ఆయన మంత్రి వర్గంలోకి తన ముఖ్య అనుచరుడు సంభాని చంద్రశేఖర్‌కు మంత్రి పదవి ఇప్పించారు.
లంకా సాగర్ ప్రాజెక్ట్, ఎన్నెస్పీ కాలువలకు రూపకల్పన
సర్దార్ జమలాపురం కేశవరావు, పొట్లూరి సుందరం వంటి జాతీయ నాయకులతో కలిసి గ్రంథాలయ ఉద్యమం, పత్రికా ఉద్యమాలను నడిపారు. జీవహింసకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. ఆయన తన స్వగ్రామంలో నాటికాలంలో రాత్రిపూట పాఠశాలలను నడిపి అభ్యుదయ ఉద్యమానికి నాందిపలికారు. అంటరానితనం పీడిస్తున్న తరుణంలో దళితవర్గాల ఉద్ధరణకోసం హాస్టళ్లను ఏర్పాటుచేశారు. భారీ నీటిపారుదల శాఖమంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఎన్‌ఎస్‌పీ కాలువలు, లంకా సాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి హైలెవల్ కాలువలకు రూపకల్పన చేశారు. మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తనసొంత మండలంలో కట్లేరు ప్రాజెక్టును నిర్మించి వేలాది ఎకరాల పంటపొలాలకు సాగునీరు అందించారు. తన స్వగ్రామంలో ప్రభుత్వ ఆస్పత్రిని, ఇంటర్మీడియట్ కళాశాలలను నెలకొల్పేందుకు కృషిచేశారు. అనారోగ్యంతో 2011లో మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment