బలిపీఠంపై అన్నదాత!
* విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు
* రోజురోజుకూ ఆవిరవుతున్న ఆశలు
* అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణాలు
* వారం రోజుల్లో ఐదుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రోజుకో రైతు బలిపీఠం ఎక్కుతున్నాడు. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక తనువులు చాలిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం నుంచే రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల జిల్లాలో 15 రైతులు ఆత్మహత్య చేసుకోగా కేవలం వారం వ్యవధిలో ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సాధారణంగా రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోతే.. తక్షణమే స్థానిక రెవెన్యూ అధికారులు ఆ వివరాలు నమోదు చేసుకుని జిల్లా యంత్రాంగానికి సమర్పించాలి. అనంతరం జిల్లాస్థాయిలో ఉండే ప్రత్యేక కమిటీ ఆత్మహత్యపై విచారణ పూర్తిచేసి అనంతరం ప్రభుత్వానికి నివేదించాలి.
ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వం పరిహారం మంజూరు చేస్తుంది. ఇదంతా క్రమం పద్దతిలో జరగాలి. కానీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంతో ఈ పద్దతి గాడి తప్పింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటినుంచీ ఈ కమిటీ భేటీ కాకపోవడం గమనార్హం. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ అధికారులు రైతు మరణాల వివరాలు నమోదు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికీ వివరాలు అందించలేదు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెబుతుండడం గమనార్హం.
వారం రోజుల్లోనే ఐదుగురు..
* వికారాబాద్ మండలం దన్నారం గ్రామానికి చెందిన ఆలూరి బాలయ్యకు రెండేళ్లుగా దిగుబడులు ఆశాజనంకంగా లేకపోవడం.. ఇటీవలి ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తి, మొక్కజొన్న పంటలు ఎండుముఖం పట్టడాన్ని చూసి ఈనెల 24న పొలం సమీపంలోని పశువుల పాకలోని దూలానికి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
* వికారాబాద్ మండలంలోని పులుసుమామిడి గ్రామంలో కౌలురైతు ఎండీ బురాన్ పదెరాల్లో క్యారెట్, టమాట, క్యాబేజీ పంటలు సాగుచేస్తుండగా.. కరెంటుకోతలు, వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనతో ఉన్న బురాన్ ఈనెల 24న గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు.
* వర్షాభావ పరిస్థితులతో దిగుబడి రాదనే ఆందోళనతో పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన మల్లిగారి రామస్వామి ఈనెల 23న తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
* ఒకవైపు వర్షాలు లేక పొలం ఎండిపోవడం.. మరోవైపు అప్పు ఇచ్చిన వ్యాపారులు ఒత్తిడి చేస్తుండడంతో ఈనెల 23న షాబాద్ మండలం కుమ్మరిగూడకు చెందిన రైతు కుమ్మరి సత్తయ్య తన ఇంట్లోనే ఉరివేసుకుని తనువు చాలించాడు.
* మంచాల మండలం ఆగపల్లి, గోసుల దశరథ ప్రైవేటు అప్పులు తీసుకుని రెండు బోర్లు వేయగా.. చుక్కనీరు పడకపోవడం, పంట ఎండిపోవడంతో ఈనెల 21న తనపొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. బుధవారం సాయంత్రం మృతిచెందాడు.