
జెండా ఎగురవేయండిలా..
జాగ్రత్తలు తప్పనిసరి
పంద్రాగస్టు వేడుకులకు సిద్ధమవుతున్న ప్రజలు
దోమ : శనివారం జరుపుకోనున్న 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గ్రామగ్రామాన సన్నాహక కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రజలంతా జెండావిష్కరణ వేడుకల్లో పాలుపంచుకునేందుకు తహతహలాడుతున్నారు. ఎక్కడ చూసినా దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. వేడుకలకు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయితే కొద్దిపాటి అజాగ్రత్తలతో ఏటా స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఎక్కడో ఓ చోట అపశ్రుతులు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో జాతీయ జెండావిష్కరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
భారత పతాక నిబంధనల అవతరణ..
భారత ప్రమాణాల సమితి(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) మూడు దశలలో జారీ చేసిన పత్రాలకు అనుగుణంగా మన దేశ జెండా తయారీ, ప్రదర్శనలను నిర్దేశించే చక్రాలను భారత పతాక నిబంధనలుగా పేర్కొంటారు. 1950 జాతీయ చిహ్నాలు, పేర్లు, నిబంధనల చట్టం, 1971 జాతీయ గౌరవ అవమానాలు నిరోధించే చట్టం కలిసి 2002లో భారత పతాక నిబంధనలుగా అవతరించాయి.
జాతీయ జెండావిష్కరణ.. నిబంధనలు..
► జాతీయ జెండా 3 రంగుల సమాన వెడల్పు గల పట్టీలలో పై పట్టీ కాషాయ(కేసరీ) వర్ణం, మధ్యలో తెలుపు, దిగువన ముదురు ఆకుపచ్చ పట్టీలతో ఉండాలి.
► జెండా పరిమాణం.. అంటే పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2గా ఉండాలి.
► 6300/4200, 3600/2400, 2700/1800, 1800/1200, 1350/ 900, 900 /600, 450 /300, 225/ 150, 150 /100 (పొడవు/ వెడల్పు మిల్లీమీటర్లలో) ఏదైనా ఒక కొలతను కలిగి ఉండాలి.
► 24 చువ్వలు గల నావికా నీలం రంగు గల అశోక చక్రం తెలుపు పట్టీ మధ్యలో ఉండాలి.
► భారత జాతీయ పతాకాన్ని ఖాదీ, చేనేత వస్త్రాలతో మాత్రమే తయారు చేయాలి. ముడి పదార్థాలుగా నూలు, పత్తి, ఉన్ని వాడొచ్చు.
► ఇతర వాటితో తయారుచేస్తే జరిమానాతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే వీలుంది.
► జెండా ఎగురవేసినపుడు కాషాయ వర్ణం పైకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
► జెండా పట్టికలు వేదికలు, భవనాల కప్పు, పిట్టగోడలపై నుంచి వేలాడదీయరాదు.
► ఏదైనా సమావేశ స్థానంలో జెండా ప్రదర్శింపదలచుకుంటే ప్రసంగకర్తకు కుడివైపుగా జెండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
► జాతీయ జెండాకు సమానంగా గానీ ఇంకా ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు.
► జాతీయ జెండా ఊరేగింపులో గానీ, కవాతులోగానీ ఇతర జెండాలతో కలిసి తీసుకువెళ్లేటప్పుడు వాటికి ముందు మధ్యలో గానీ, కుడివైపున గానీ ఉండేలా చూసుకోవాలి.
► ఏదైనా ఒక ప్రతిమ, జ్ఞాపకం, ఫలకానికి విశేషాలంకారంగానే తప్ప జెండాను ఏ వస్తువుకూ తొడుగుగా వాడరాదు. ఏ వ్యక్తికీ చుట్టబడరాదు.
► జెండా ఎరుగవేత, దించే సమయంలో వ్యక్తులందరూ జెండాకు అభిముఖంగా నిలబడాలి.
► సూర్యాస్తమయానికి ముందే జెండాను కిందికి దించాలి.