
నేడు జెండా ఎగరేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకిలా? ఈ రోజు ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా ఎగరేస్తే..జనవరి 26న మాత్రం రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. నేడు జెండా ఎగరేసాం అంటాం. మరీ గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం అని అంటాం ఎందుకని? వాటి మధ్య ఉన్న తేడా ఏంటంటే..
ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు... అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.
ఆ తేడా ఏంటంటే.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు... కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. ( గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).
నేడు ప్రధాని.. ఆ రోజు రాష్ట్రపతి చేయడానికి ప్రధాన కారణం
దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling).
(చదవండి: అక్కడ మాత్రం అర్థరాత్రే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు)
Comments
Please login to add a commentAdd a comment