
లక్నో: 72వ గణతంత్ర దినోత్సవం నాడు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మంగళవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటి.. మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దాదాపు 5 ఎకరాల విస్తీరణంలో మసీదు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మాట్లాడుతూ..
మసీదు నిర్మాణ స్థలిలో భూసార పరీక్షలను ప్రారంభించామని, దానికి సంబంధించిన నివేదికలు అందగానే పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణకు పిలుపునిచ్చామని, ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. గత నెలలోనే ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీదు నమూనాను ఆవిష్కరించిందని, సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం జరుగుతుందని, మసీదు నిర్మాణంపై భారీ గాజు గోపురం కలిగివుంటుందని ఆయన వివరించారు.
మసీదు వెనుక భాగంలో అత్యాధునిక డిజైన్‌తో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మసీదు పేరును ఇంకా ఖరారు చేయలేదని, త్వరలోనే ట్రస్ట్ సభ్యులందరూ సమావేశమై మసీదు పేరును నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, మసీదు నిర్మించబోయే స్థలం.. రామ జన్మభూమిలోని రామ మందిర నిర్మాణ స్థలికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామమందిరం, మసీదు రెండూ ఒకే జిల్లాలో ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment