గోల్కొండ కోటలో ఘనంగా పంద్రాగస్టు
సాక్షి, హైదరాబాద్: కోట గోడ మీద సైనికుల పహారా.. పక్కనే స్వాగత ద్వారంపై భేరీలు, నగారాలు మోగిస్తూ జయజయధ్వానాలు.. సంప్రదాయ వాద్య, సంగీత, నృత్య విన్యాసాలు.. చిందు యక్షగాన మాధుర్యం.. ఒగ్గుడోలు లయబద్ధ శబ్ద విన్యాసం.. వీటన్నింటికీ సొగసులద్దుతున్నట్టుగా లంబాడీ యువతుల నృత్యాలు.. మేమేమీ తీసిపోమన్నట్టు యువకుల గుస్సాడీ నృత్యాలు.. ఆ పక్కనే కొమ్ముబూరల పలకరింపు.. హైదరాబాదీ ప్రత్యేక మార్ఫీ ఉల్లాసం.. రాజన్న డోలు, డప్పుల శబ్దాలు.. ఆ ఊపును మరింత పెంచే షేరీబాజా బృందం.. ఖవ్వాలీ సంగీతం.. ముజ్రా నృత్యం... ఇదీ గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల దృశ్యం.
70వ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు అలరించాయి.
అమర జవాన్లకు నివాళులర్పించి..
తొలుత సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్ద ఉన్న అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఉదయం పది గంటల సమయంలో గోల్కొండ కోటకు చేరుకున్నారు. పోలీసు సమ్మాన్ గార్డ్స్ స్వాగతిస్తుండగా కోటలోకి వచ్చారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించి, పోలీసు వందనం స్వీకరిం చారు. హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి హరితమిత్ర పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి పోలీసు పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి మెడల్స్ ప్రదానం చేశారు.
స్థలాభావం.. అంతా హడావుడి..
స్వాతంత్య్ర దినోత్సవం అనగానే పోలీసు వందనం, వివిధ విభాగాల పోలీసులు, ఎన్‌సీసీ సిబ్బంది కవాతు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, చిన్నారుల నృత్య విన్యాసాలు ఉంటాయి. వాటిని వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించినప్పుడు ఆ సందడి కనిపించేది. కానీ గోల్కొండ కోటలో దిగువన రాణీమహల్ వద్ద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్కడ సరిపడినంత స్థలం లేక పోలీసు కవాతు, శకటాలు, నృత్యాలకు అవకాశం లేకుండా పోయింది.
సోమవారం వందల మంది కళాకారులు ప్రదర్శించిన సంగీత, నృత్య విన్యాసాలు ఆకట్టుకున్నా... వాటికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. సీఎం కేసీఆర్ కోట వద్దకు కొద్ది సేపట్లో చేరుకుంటారనగా కళాకారులకు అవకాశమిచ్చారు. కానీ రెండు, మూడు నిమిషాల్లోనే ముగించాలనడంతో వారంతా ఉసూరుమన్నారు. తమ విన్యాసాల్లో మునిగిపోయిన కళాకారులకు ‘చాలు.. ఇక ఆపండి’ అని పలుమార్లు సూచించడంతో.. సందర్శకులు విస్మ యం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చిన్నారులు ప్రత్యేక విన్యాసాలకు సిద్ధమైనా.. ప్రదర్శించే అవకాశం లేకపోవటంతో సీఎం ప్రసంగానికి చప్పట్లు కొట్టడానికే పరిమితమయ్యారు.
ప్రసంగం అనంతరం అర నిమిషం పాటు అలల తరహాలో విన్యాసంతో ఆకట్టుకున్నారు. స్థలంలేక సాధారణ సందర్శకులను లోనికి అనుమతించకపోవడంతో కోటకు దూరంగానే ఉండిపోయారు. వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులు, అమెరికా, ఇరాన్ ఎంబసీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పురస్కార గ్రహీతలు వీరే..
హరిత మిత్ర పురస్కారాలు అందుకున్నవారు..
నిజామాబాద్ కలెక్టర్ యోగితారాణా, నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిద్ద జెడ్పీ పాఠశాల, సిద్దిపేట పురపాలక సంఘం, ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, గ్రామీణాభివృద్ది శాఖ జాయింట్ కమిషనర్, హయత్‌నగర్ డిస్పెన్సరీ అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ వంశీకృష్ణారెడ్డి, మెదక్ గ్రామీణ నీటి పారుదల విభాగం ఎస్‌ఈ విజయ్‌ప్రకాశ్.
రాష్ట్రపతి పురస్కారం పొందిన సూక్ష్మ కళాఖండాల నిపుణుడు మారుతికి ప్రశంసా పత్రం అందజేశారు.
పోలీసు సేవాపతకాలు పొందినవారు
రవి గుప్తా (ఐపీఎస్), నవీన్ చంద్ (ఐపీఎస్), గోవింద్ సింగ్ (ఐపీఎస్), వై.గంగాధర్ (ఐపీఎస్), నాగరాజు (అదనపు డీసీపీ), అనూప్ కుమార్‌మిశ్రా (డీఎస్పీ), ఆర్.వెంకటయ్య (గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండర్), బి.జనార్దన్ (డీఎస్పీ), నారాయణ (ఏసీపీ), డి.రామ్‌గోపాల్ (ఇన్‌స్పెక్టర్), ఎండీ గౌస్ (ఆర్‌ఎస్‌ఐ-పీటీసీ), తిరుపతిరెడ్డి (ఏఎస్సై), లక్ష్మారెడ్డి (హెడ్‌కానిస్టేబుల్), వెంకటేశ్వరరావు (హెడ్‌కానిస్టేబుల్), లునావత్ గోపి (కానిస్టేబుల్), ఐలమల్లు (ఫైర్‌మ్యాన్), ఎంఏ రవూఫ్ (డ్రైవర్ ఫైర్ ఆపరేటర్)