గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలెందుకు?
{పజలకు సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలి
ఆ కోట నియంతృత్వానికి, అరాచకానికి నిదర్శనం
అక్కడ సెప్టెంబర్ 17న సీఎం జెండా ఎగురవేయాలి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్: నిరంకుశత్వం, అకృత్యాలు, అరాచక పాలనకు సాక్షీభూతంగా నిలిచిన గోల్కొండ కోటను దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు వేదికగా ఎంపిక చేయటానికి కారణమేంటో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రజలకు వివరణ ఇవ్వాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆగస్టు 15న తెలంగాణకు స్వాతంత్య్రం రాకుండా అడ్డుపడ్డ నిజాం పాలన సాగిన కోటపై దేశ జెండా ఎగురవేయాలనేది సీఎం సొంత కుటుంబ విషయం కాదని, జాతీయ పండగ అయినందున ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం బీజేపీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17న కేసీఆర్ గోల్కొండ కోటపై జెండా ఎగురవేయాలని డిమాండ్ చేశారు. ఆ రోజు తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రభుత్వపక్షాన ఆయన ఆదేశాలివ్వాలన్నారు. తెలంగాణలో వానలు లేక, కరెంటు సరిపోక రైతులు తీవ్ర ఆందోళనలో రోడ్డెక్కితే వారిని లాఠీలతో కొట్టించిన ప్రభుత్వం, మరోైవె పు తెలంగాణ పట్టణాలను లండన్, న్యూయార్క్‌లుగా మారుస్తామని చెప్పటం విడ్డూరమన్నారు. సీఎంకు ప్రజోపయోగ పనుల విషయంలో ప్రాధాన్యాలు తెలుస్తున్నట్టు లేదని విమర్శించారు. పంటలు కోల్పోతామన్న ఆందోళనలో ఉన్న రైతులకు కరెంటు ఎప్పుడు ఇస్తామో ప్రకటించి భరోసా ఇవ్వాల్సిందిపోయి.. లాఠీలెత్తటం తగదన్నారు. కరెంటు కష్టాలను ప్రజలు భరించాల్సిందేనని సీఎం చెప్పటం దారుణమన్నారు.
ఈనెల 21న తెలంగాణకు అమిత్‌షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 21న తెలంగాణకు వస్తున్నారని, ఆయన రెండు రోజులపాటు ఇక్కడే ఉండి పార్టీ పటిష్టానికి దిశానిర్దేశం చేస్తారని కిషన్‌రెడ్డి చెప్పారు. తొలిరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తారని, రెండో రోజు గ్రామ కమిటీలు, మండల, జిల్లా పదాధికారులతో భేటీ అవుతారని వివరించారు.