సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో జాతీయజెండాను ఎగురవేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం జెండా వందనం సందర్భంగా కేంద్ర బలగాల కవాతు కూడా నిర్వహించనున్నారు.
సాయంత్రం గోల్కొండ కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో కిషన్‌రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్‌రెడ్డి లేదా సీనియర్ మంత్రి జాతీయజెండాను ఎగురవేసే అవకాశముంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీలకు ఆహ్వానాలు పంపనున్నట్లు సమాచారం.
గత సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు బీజేపీ అగ్రనేత, కేంద్రహోం మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరై సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ ఇతర కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే తరహాలో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న మోదీ
దేశంలో ఉగ్రవాద కదలికలను కట్టడి చేసి ప్రపంచ దేశాలకు భారత దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న నేత ప్రధాని మోదీ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ పాలనలో పది లక్షల కుంభకోణం జరిగిందని కాగ్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment