ముంపు గ్రామాలను రీసర్వే చేయాలి
మెదక్: ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో పాపన్నపేట మండలంలో ముంపునకు గురయ్యే గ్రామాలపై రీ సర్వే చేయాలని ఘనపురం ఆనకట్ట ముంపు బాధితుల పోరాట కమిటీ బాధితులు శనివారం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం మాట్లాడుతూ మంజీరానదిపై గల ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపువల్ల ముంపునకు గురయ్యే పాపన్నపేట మండలంలోని గ్రామాల్లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పటికీ అందులో చాలా లోపాలున్నాయన్నారు.
ముంపునకు గురవుతున్న భూములను సగమే గుర్తించారని ఆరోపించారు. దీనిపై మరోసారి సర్వేచేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి బాలమణి, మండల కార్యదర్శి కె.మల్లేశం బాధిత రైతులు వెంకట్‌గాంధీ, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.