చెరువులకు పూర్వవైభవం
‘మిషన్ కాకతీయ’పై నజర్
* జిల్లాలో 1,580 చెరువుల ఎంపిక
* చురుగ్గా సాగుతున్న సర్వే పనులు
* నేడు మంత్రి హరీష్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం
సాక్షి, సంగారెడ్డి: చెరువుల పునరుద్ధరణకు సర్కార్ చేపట్టిన ‘మిషన్ కాకతీయ’పై అందరూ దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు సోమవారం జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో చేపట్టనున్న ‘మిషన్ కాకతీయ’ పనులపై మంత్రి నీటిపారుదల శాఖ అధికారులకు సూచనలు చే యనున్నారు. చెరువుల పునరుద్ధరణ పనులు ఎ లా చేపట్టాలి, పనుల నాణ్యత, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై మంత్రి హరీష్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
గొలుసుకట్టు చెరువులపైనా చర్చ
జిల్లాలోని గొలుసుకట్టు చెరువులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీంతో మంత్రి హరీష్‌రావు జిల్లాలోని గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అంశంపై ప్రత్యేక శ్ర ద్ధ కనబరుస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు సమీక్ష సమావేశంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో చెరువులు పునరుద్ధరణ, మరమ్మతు పనుల కోసం 1,580 చెరువులను అధికారులు గుర్తించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 136, దుబ్బాకలో 275, గజ్వేల్‌లో 243, అందోలులో 160, సంగారెడ్డిలో 107, పటాన్‌చెరులో 85, జహీరాబాద్‌లో 67, నారాయణఖేడ్‌లో 85, నర్సాపూర్‌లో 60, మెదక్‌లో 352 చెరువులను గుర్తించారు. ఈ చెరువుల మరమ్మతు, అభివృద్ధి పనులు డిసెంబర్‌లో చేపట్టనున్నారు.
ఇందుకు సంబంధించి చెరువుల సర్వే పనులు మండలాల వారీగా నీటిపారుదల శాఖ అధికారులు ముమ్మరం చేశారు. అదే సమయంలో చెరువుల మరమ్మతు పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈనెలాఖరులోగా ప్రతిపాదనలు పూర్తి చేసి డిసెంబర్‌లో చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించనున్నారు. పునరుద్ధరణ పనుల్లో భాగంగా చెరువుల పూడికతీత పనులు, తూము, అలుగులు, కాల్వల మరమ్మతులు చేయనున్నారు. పూడికతీత, చెరువుకట్ట మరమ్మతు పనులను రైతులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టనున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
మిషన్ కాకతీయకు నీటిపారుదల శాఖలోని సిబ్బంది కొరత కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి విభాగంలో జిల్లా వ్యాప్తంగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సిద్దిపేట, అందోలు డీఈ పోస్టులతోపాటు మెదక్, సిద్దిపేట ఐబి డివిజన్‌ల పరిధిలో 8 మంది ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ పోస్టు ఒకటి, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు రెండు, ప్రింట్ టెక్నీషియన్ పోస్టు ఒకటి ఖాళీగా ఉంది.
ఇవి కాకుండా పరిపాలన పరంగా డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 3, జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఒకటి, టైపిస్టు పోస్టులు రెండు, స్టెనో పోస్టు ఒకటి, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు మూడు భర్తీ చేయాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది.