
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం తయారు చేయనున్న ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్ల సవరణల సమయంలో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తీసేసే ప్రమాదం ఉందని, అలాంటిది జరగకుండా పార్టీ నేతలంతా ఆయా గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై కన్నేసి ఉంచాలన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఉత్తమ్ అధ్యక్షతన పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, ఎమ్మెల్యే సంపత్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డిలతోపాటు పలువురు పీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రత్యక్షంగా పర్యవేక్షించే బాధ్యతలను ఆయా బూత్‌కమిటీల అధ్యక్షులపై ఉంచాలని సూచించారు.
ఓటర్ల జాబితా తయారు చేసే క్రమంలో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, అలాంటిది జరగకుండా క్షేత్రస్థాయిలో గట్టిగా ప్రతిఘటించాలన్నారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, మెజార్టీ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ ధోరణులకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న ఆక్రోశ్ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని ఉత్తమ్ కోరారు.
మేలో రాష్ట్రానికి రాహుల్
బస్సు యాత్రలో పాల్గొనేందుకు గాను వచ్చే నెలలో రాష్ట్రానికి రాహుల్ వచ్చే అవకాశముందని ఉత్తమ్ వెల్లడించారు. రాహుల్.. ఎక్కడకు, ఎప్పుడు వస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినా, వచ్చే నెలలో కచ్చితంగా వస్తారని, ఆయన పర్యటన విజయవంతం చేయాలని కోరారు. రాహుల్ పర్యటనకు రాష్ట్రంలోని బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు, సోషల్ మీడియా ఇంచార్జులు తప్పకుండా హాజరయ్యేలా చూడాలని కాంగ్రెస్ నేతలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment