- బీసీ రుణాలకు లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు
కరీంనగర్ రాంనగర్‌కు చెందిన శ్రీధర్ అనే నిరుద్యోగి బీసీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆశపడ్డాడు. దరఖాస్తుతో పాటు బ్యాంక్ కాన్సెంట్ అవసరం కావడంతో యూనిట్లు కేటాయించిన బ్యాంకుల చుట్టూ తిరిగాడు. బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన రాజును ఓ బ్రోకర్ పలకరించాడు. రూ.7వేలు ఇస్తే బ్యాంక్ కాన్సెంట్ ఇప్పిస్తానని బేరం పెట్టాడు. చివరకు రూ.5వేలు తీసుకొని కోర్టు సమీపంలోని ఓ బ్యాంక్ నుంచి కాన్సెంట్ ఇప్పించాడు.
పెద్దపల్లి డివిజన్‌లోని ఓ మండలంలో పి.రాజు అనే యువకుడు రూ.2లక్షల రుణానికి దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంక్ కాన్సెంట్‌తో సంబంధిత ఎంపీడీఓ కార్యాలయానికి వెళితే అప్పటికే రూ.2లక్షల యూనిట్‌కు ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువును ఎంపిక చేశారని, నీవు దరఖాస్తు చేయడం వృథా అని సదరు సిబ్బంది చల్లగా సెలవిచ్చారు.
- రూ.5వేలిస్తే బ్యాంక్ కాన్సెంట్
- రూ.2లక్షల యూనిట్‌కు డిమాండ్
- గడువు పూర్తికాకముందే ఎంపిక
- ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం
కరీంనగర్ సిటీ: జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఎంపిక జరుగుతున్న తీరుకు మచ్చుతునకలివీ. జిల్లావ్యాప్తంగా ఇంచుమించు ఇలాంటి ఉదంతాలే చోటు చేసుకుంటున్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు ప్రభుత్వం అందచేస్తున్న రుణాలు జిల్లాలో పైరవీలకు రాచబాటగా మారాయి. బ్యాంక్ కాన్సెంట్ కావాలన్నా... రుణం పొందాలన్నా... చివరకు రూ.లక్ష సబ్సిడీతో రూ.2లక్షల రుణం తీసుకోవాలన్నా బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గడువుకు ముందే ఎంపిక..
బీసీ రుణాల కోసం దరఖాస్తుకు ఈ నెల 15 వరకు ప్రభుత్వం గడువు పొడగించింది. కానీ ఆశ్చర్యకరంగా చాలా మున్సిపాలిటీల్లో, మండలాల్లో లబ్దిదారులను ఎంపిక చేశారు. ముఖ్యంగా రూ.2లక్షల యూనిట్లకు సంబంధించిన ఎంపికను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. సాధారణంగా పూర్తి అర్హత ప్రమాణాలతో తగిన సర్టిఫికెట్లు, బ్యాంక్ కాన్సెంట్‌తో సదరు నిరుద్యోగి మున్సిపాలిటీ, మండల కార్యాలయూల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను సిబ్బంది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఆ తరువాత బ్యాంకర్లు, అధికారులు కలిసి ఒకేరోజు దరఖాస్తుదారులతో సమావేశం ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపిక చేయాలి. అలా ఎంపిక చేసిన జాబితాను బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాలి. కలెక్టర్ ఆమోదం పొందిన తరువాత లబ్దిదారులకు రుణం మంజూరవుతుంది. బ్యాంక్ అకౌంట్‌లో సబ్సిడీ జమవుతుంది. ఇది రుణాల ఎంపిక ప్రక్రియ. కానీ కొన్ని మున్సిపాలిటీల్లో కనీసం బ్యాంకర్లను పిలవకుండానే లబ్దిదారుల ఎంపికను పూర్తి చేశారు. మరికొన్ని మున్సిపాలిటీల్లో డబ్బులిస్తేనే రూ.2లక్షల యూనిట్‌ను అప్‌లోడ్ చేస్తామని, లేదంటే రూ.60 వేల యూనిట్‌గా మారుస్తామని అంటున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.
ఇంకొన్ని చోట్ల రూ.2లక్షల యూనిట్ల సంఖ్యకు సమానంగా తమకు దగ్గరి వ్యక్తుల నుంచి దరఖాస్తులు వస్తే, మిగిలిన రూ.2లక్షల యూనిట్ దరఖాస్తులను రూ.లక్ష, రూ.60వేల యూనిట్లుగా మారుస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ప్రజాప్రతినిధులకే సొంతం
చాలా రోజుల తరువాత బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు కావడంతో సహజంగానే పోటీ అధికమైంది. ప్రధానంగా రూ.2లక్షల రుణంలో రూ.లక్ష సబ్సిడీ ఉండడంతో ఈ యూనిట్లకు తీవ్రస్థాయిలో డిమాండ్ ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా రూ.2లక్షల యూనిట్లు 178 మంజూరయ్యాయి. అత్యధికంగా రామగుండం కార్పొరేషన్‌కు 14, కరీంనగర్ కార్పొరేషన్‌కు ఎనిమిది రూ.2లక్షల యూనిట్లు కేటాయించారు.
ఇతర యూనిట్లను పెద్దగా పట్టించుకోని ప్ర జాప్రతినిధులు రూ.2లక్షల యూనిట్లను మిగతా వారికి దక్కనీయడం లేదు. మున్సిపల్, మండలాల్లో ఎక్కడైనా స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులకే ఈ యూనిట్లు కేటారుుంచేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్ని చోట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది బంధుగణానికి ఈ యూనిట్లు అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నారు.
5922 యూనిట్లు
జిల్లాకు బీసీ కార్పొరేషన్ ద్వారా మొత్తం 5,922 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిపై సబ్సిడీని 50 శాతంగా (రూ.లక్ష దాటకుండా) నిర్ణయించారు. యూనిట్ ఆధారంగా రూ.20వే లు, రూ.25వేలు, రూ.30 వేలు, రూ.50వేలు, రూ.లక్ష సబ్సిడీని చెల్లిస్తారు. మొత్తం యూనిట్లకు రూ.116.26 కోట్ల సబ్సి డీ లబ్దిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.
పైరవీ జెయ్యాలె.. పైసలియ్యాలె..!
Published Tue, May 5 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement
Advertisement