government loans
-
మన రూపాయి పవర్ ఏంటో చూపించాలి - ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలో భారతీయ బ్యాంకులను, కరెన్సీని కీలక భాగంగా చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడంపై ఆర్థిక సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘మన దేశీ బ్యాంకులు, కరెన్సీని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నిర్వహణలో వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వివరించారు. ఇదే సందర్భంగా ’జన్ సమర్థ్’ పోర్టల్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. 13 రకాల ప్రభుత్వ రుణాల స్కీములకు సంబంధించిన పోర్టల్‌గా ఇది పని చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వ్యాపారవేత్తలకు రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు జన్ సమర్థ్ తోడ్పడుతుంది. వారి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు తమ లక్ష్యాలను సాధించుకోవడంలో తోడ్పడగలదు‘ అని మోదీ పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సర్వీసులను అందించేందుకు అనువైన అనేక ప్లాట్‌ఫామ్‌లను భారత్ అభివృద్ధి చేసిందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక నాణేల సిరీస్ ఆవిష్కరణ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సిరీస్ నాణేలను ప్రధాని ఆవిష్కరించారు. రూ. 1, రూ. 2, 5, 10, రూ. 20 డినామినేషన్లలో ఇవి ఉంటాయి. వీటిపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) డిజైన్ ఉంటుంది. ఇవి స్మారక కాయిన్లు కాదని, యథాప్రకారం చెలామణీలో ఉంటాయని ప్రధాని తెలిపారు. అమృత ఘడియల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం గురించి ప్రజలకు నిరంతరం గుర్తు చేసేలా, దేశ అభివృద్ధి కోసం పని చేసేలా ప్రోత్సహించేందుకు కొత్త సిరీస్ నాణేలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు. -
కరోనాతో కేంద్రంపై మరింత రుణ భారం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రుణాలపైనా కోవిడ్–19 భారం పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్– 2021 ఏప్రిల్) మధ్య తన స్థూల మార్కెట్ రుణ సమీకరణ అంచనాలను కేంద్రం శుక్రవారం గణనీయంగా రూ.12 లక్షల కోట్లకు పెంచేసింది. నిజానికి తొలి అంచనా రూ.7.8 లక్షల కోట్లు. అంటే రుణ సమీకరణ అంచనా 4.2 లక్షల కోట్లు పెరిగిందన్నమాట. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో తగ్గుతుందని భావిస్తున్న తన ఆదాయాన్ని పూడ్చుకునే క్రమంలో రుణ సమీకరణ అంచనాలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వారం వారీ రుణ సమీకరణ లక్ష్యాన్ని కూడా రూ.21,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు కేంద్రం పెం చింది. తన ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం మార్కెట్ రుణాలను ఒక సాధనంగా ఎంచుకునే సంగతి తెలిసిందే. 2019–20లో మార్కెట్ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యాన్ని (ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో 3.5%)కూడా ఆర్థికశాఖ పెంచే అవకాశం ఉంది. -
పైరవీ జెయ్యాలె.. పైసలియ్యాలె..!
- బీసీ రుణాలకు లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు కరీంనగర్ రాంనగర్‌కు చెందిన శ్రీధర్ అనే నిరుద్యోగి బీసీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆశపడ్డాడు. దరఖాస్తుతో పాటు బ్యాంక్ కాన్సెంట్ అవసరం కావడంతో యూనిట్లు కేటాయించిన బ్యాంకుల చుట్టూ తిరిగాడు. బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన రాజును ఓ బ్రోకర్ పలకరించాడు. రూ.7వేలు ఇస్తే బ్యాంక్ కాన్సెంట్ ఇప్పిస్తానని బేరం పెట్టాడు. చివరకు రూ.5వేలు తీసుకొని కోర్టు సమీపంలోని ఓ బ్యాంక్ నుంచి కాన్సెంట్ ఇప్పించాడు. పెద్దపల్లి డివిజన్లోని ఓ మండలంలో పి.రాజు అనే యువకుడు రూ.2లక్షల రుణానికి దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంక్ కాన్సెంట్‌తో సంబంధిత ఎంపీడీఓ కార్యాలయానికి వెళితే అప్పటికే రూ.2లక్షల యూనిట్‌కు ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువును ఎంపిక చేశారని, నీవు దరఖాస్తు చేయడం వృథా అని సదరు సిబ్బంది చల్లగా సెలవిచ్చారు. - రూ.5వేలిస్తే బ్యాంక్ కాన్సెంట్ - రూ.2లక్షల యూనిట్‌కు డిమాండ్ - గడువు పూర్తికాకముందే ఎంపిక - ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం కరీంనగర్ సిటీ: జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల యూనిట్ల ఎంపిక జరుగుతున్న తీరుకు మచ్చుతునకలివీ. జిల్లావ్యాప్తంగా ఇంచుమించు ఇలాంటి ఉదంతాలే చోటు చేసుకుంటున్నాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగులకు ప్రభుత్వం అందచేస్తున్న రుణాలు జిల్లాలో పైరవీలకు రాచబాటగా మారాయి. బ్యాంక్ కాన్సెంట్ కావాలన్నా... రుణం పొందాలన్నా... చివరకు రూ.లక్ష సబ్సిడీతో రూ.2లక్షల రుణం తీసుకోవాలన్నా బ్రోకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడువుకు ముందే ఎంపిక.. బీసీ రుణాల కోసం దరఖాస్తుకు ఈ నెల 15 వరకు ప్రభుత్వం గడువు పొడగించింది. కానీ ఆశ్చర్యకరంగా చాలా మున్సిపాలిటీల్లో, మండలాల్లో లబ్దిదారులను ఎంపిక చేశారు. ముఖ్యంగా రూ.2లక్షల యూనిట్లకు సంబంధించిన ఎంపికను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. సాధారణంగా పూర్తి అర్హత ప్రమాణాలతో తగిన సర్టిఫికెట్లు, బ్యాంక్ కాన్సెంట్‌తో సదరు నిరుద్యోగి మున్సిపాలిటీ, మండల కార్యాలయూల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను సిబ్బంది ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆ తరువాత బ్యాంకర్లు, అధికారులు కలిసి ఒకేరోజు దరఖాస్తుదారులతో సమావేశం ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపిక చేయాలి. అలా ఎంపిక చేసిన జాబితాను బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి పంపించాలి. కలెక్టర్ ఆమోదం పొందిన తరువాత లబ్దిదారులకు రుణం మంజూరవుతుంది. బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ జమవుతుంది. ఇది రుణాల ఎంపిక ప్రక్రియ. కానీ కొన్ని మున్సిపాలిటీల్లో కనీసం బ్యాంకర్లను పిలవకుండానే లబ్దిదారుల ఎంపికను పూర్తి చేశారు. మరికొన్ని మున్సిపాలిటీల్లో డబ్బులిస్తేనే రూ.2లక్షల యూనిట్‌ను అప్లోడ్ చేస్తామని, లేదంటే రూ.60 వేల యూనిట్‌గా మారుస్తామని అంటున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల రూ.2లక్షల యూనిట్ల సంఖ్యకు సమానంగా తమకు దగ్గరి వ్యక్తుల నుంచి దరఖాస్తులు వస్తే, మిగిలిన రూ.2లక్షల యూనిట్ దరఖాస్తులను రూ.లక్ష, రూ.60వేల యూనిట్లుగా మారుస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల కనుసన్నల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రజాప్రతినిధులకే సొంతం చాలా రోజుల తరువాత బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు కావడంతో సహజంగానే పోటీ అధికమైంది. ప్రధానంగా రూ.2లక్షల రుణంలో రూ.లక్ష సబ్సిడీ ఉండడంతో ఈ యూనిట్లకు తీవ్రస్థాయిలో డిమాండ్ ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా రూ.2లక్షల యూనిట్లు 178 మంజూరయ్యాయి. అత్యధికంగా రామగుండం కార్పొరేషన్‌కు 14, కరీంనగర్ కార్పొరేషన్‌కు ఎనిమిది రూ.2లక్షల యూనిట్లు కేటాయించారు. ఇతర యూనిట్లను పెద్దగా పట్టించుకోని ప్ర జాప్రతినిధులు రూ.2లక్షల యూనిట్లను మిగతా వారికి దక్కనీయడం లేదు. మున్సిపల్, మండలాల్లో ఎక్కడైనా స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, అనుచరులకే ఈ యూనిట్లు కేటారుుంచేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్ని చోట్ల సంబంధిత అధికారులు, సిబ్బంది బంధుగణానికి ఈ యూనిట్లు అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నారు. 5922 యూనిట్లు జిల్లాకు బీసీ కార్పొరేషన్ ద్వారా మొత్తం 5,922 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిపై సబ్సిడీని 50 శాతంగా (రూ.లక్ష దాటకుండా) నిర్ణయించారు. యూనిట్ ఆధారంగా రూ.20వే లు, రూ.25వేలు, రూ.30 వేలు, రూ.50వేలు, రూ.లక్ష సబ్సిడీని చెల్లిస్తారు. మొత్తం యూనిట్లకు రూ.116.26 కోట్ల సబ్సి డీ లబ్దిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. -
అప్పుల తిప్పలు
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు చుక్కలు చూపిస్తున్నారు. పూటకో నిబంధనను తెరమీదకు తెస్తూ తప్పించుకుంటున్నారు. పాత బకాయిలు చెల్లించలేదన్న నెపంతో అర్హతలున్న సంఘాలకు సైతం రుణాలు మంజూరు చేయడానికి విముఖత చూపుతున్నారు. ఫలితంగా వెయ్యి సంఘాలకు చెందిన మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 54 వేల స్వయం సహాయక సంఘాల్లో ఆరు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరు స్వయం ఉపాధి పొందేందుకు ఐకేపీ ద్వారా బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి పథకాల ద్వారా ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. పది మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సంఘానికి తొలి దశలో రూ.50 వేలు, మలి దశలో రూ.లక్ష రుణం మంజూరు చేస్తారు. ఈ రుణ మొత్తాన్ని ఐకేపీ నిబంధనల మేరకు 12 నెలల్లో నెలవారి కంతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. 2012-13 సంవత్సరంలో రూ.562 కోట్లు బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళలకు మంజూరు చేశారు. ఇందులో 5 శాతం మంది మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2014 జనవరి నాటికి రూ.465 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఐకేపీ అధికారులకు లక్ష్యం పెట్టింది. ఇప్పటికే రూ.410 కోట్లు మంజూరు చేశారు. నెలాఖరుకు మిగిలిన మొత్తాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో 1000 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రూ.42 కోట్లు మాత్రం ఓవర్ డ్యూస్ (పాత బకాయిలు) ఉన్నాయి. దీంతో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. ఐకేపీ అధికారులు రుణాల మంజూరుకు కసరత్తు చేస్తున్నా బ్యాంకర్లు మాత్రం ఆ వైపు దృష్టి సారించడం లేదు. ఓవర్ డ్యూస్ ఉంటే తాము ఉన్నతాధికారుల నుంచి మాట పడాల్సి వస్తుందని భావించిన కొంత మంది బ్యాంకర్లు అలాంటి సంఘాలకు రుణాలు ఇచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. మహిళలు స్వయం సహాయక సంఘంలో వచ్చే రుణాలతో దుకాణాలు, పాడి పశువుల పెంపకం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఓవర్ డ్యూస్‌ను బూచిగా చూపి సకాలంలో కంతులు చెల్లిస్తున్న సంఘాలకు కూడా రుణాలు ఇవ్వడం ఆపేస్తే ఎలాగని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పక్కనపెట్టి అర్హత ఉన్న సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. వడ్డీ లేని రుణం ఉత్తిదే! జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు పావలా వడ్డీ రుణాల కింద 2010-11లో రూ.361 కోట్లు, 2011-12లో రూ.462 కోట్లు మంజూరయ్యాయి. 2012-13లో వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం కేవలం రూ.273 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. 2012 జనవరి నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం కిరణ్ అప్పుడే మాటమార్చారు. ఇప్పట్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వలేమని, 2013 జూలై నుంచి అమలు చేస్తామన్నారు. అప్పట్లో సీఎం ఆర్భాటంగా ఇచ్చిన హామీతో మహిళలు విరివిగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వడ్డీ రాలేదని, వెంటనే వడ్డీ చెల్లించాలంటూ బ్యాంకర్లు మహిళలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేది లేక అప్పులు తెచ్చి బ్యాంకులకు వడ్డీ చెల్లించారు. ఈ తరహా బ్యాంకులకు మహిళలు చెల్లించిన వడ్డీనే రూ.24.51 కోట్లకు చేరింది. అయితే తాము చెల్లించిన ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందా అని మహిళలు ఎదురు చూస్తున్నారు. బ్యాంకర్లతో చర్చిస్తున్నాం : నీలకంఠారెడ్డి, డీఆర్డీఏ పీడీ జిల్లాలో 2013-14 జనవరి నెలాఖరు నాటికి రూ.465 కోట్లు బ్యాంక్ లింకేజీ ద్వారా మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికీ రూ.410 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన మొత్తాన్ని నెలాఖరులోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పాతబకాయిలు ఉన్నాయన్న కారణంగా కొంత మంది బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు నా దృష్టికి వస్తున్నాయి. ఈ విషయమై బ్యాంకర్లతో చర్చిస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి రుణాల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటాం.. నాలుగేళ్లుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం నాలుగేళ్లుగా రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా రుణం మంజూరు చేయలేదు. గతంలో మేము మూడు సార్లు రుణం పొందాము.నెలవారీ కంతులు కూడా సక్రమంగా చెల్లించాం. ఆ తర్వాత ఎందుకో రుణం మాత్రం మంజూరు చేయలేదు.అధికారులకు అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు. - లక్ష్మీదేవి,తారకరామా మహిళా సంఘం,కదిరి మండలం