అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు చుక్కలు చూపిస్తున్నారు. పూటకో నిబంధనను తెరమీదకు తెస్తూ తప్పించుకుంటున్నారు. పాత బకాయిలు చెల్లించలేదన్న నెపంతో అర్హతలున్న సంఘాలకు సైతం రుణాలు మంజూరు చేయడానికి విముఖత చూపుతున్నారు. ఫలితంగా వెయ్యి సంఘాలకు చెందిన మహిళలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 54 వేల స్వయం సహాయక సంఘాల్లో ఆరు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరు స్వయం ఉపాధి పొందేందుకు ఐకేపీ ద్వారా బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి పథకాల ద్వారా ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. పది మంది సభ్యులున్న స్వయం సహాయక సంఘానికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సంఘానికి తొలి దశలో రూ.50 వేలు, మలి దశలో రూ.లక్ష రుణం మంజూరు చేస్తారు. ఈ రుణ మొత్తాన్ని ఐకేపీ నిబంధనల మేరకు 12 నెలల్లో నెలవారి కంతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. 2012-13 సంవత్సరంలో రూ.562 కోట్లు బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళలకు మంజూరు చేశారు. ఇందులో 5 శాతం మంది మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2014 జనవరి నాటికి రూ.465 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఐకేపీ అధికారులకు లక్ష్యం పెట్టింది. ఇప్పటికే రూ.410 కోట్లు మంజూరు చేశారు. నెలాఖరుకు మిగిలిన మొత్తాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో 1000 స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రూ.42 కోట్లు మాత్రం ఓవర్ డ్యూస్ (పాత బకాయిలు) ఉన్నాయి. దీంతో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. ఐకేపీ అధికారులు రుణాల మంజూరుకు కసరత్తు చేస్తున్నా బ్యాంకర్లు మాత్రం ఆ వైపు దృష్టి సారించడం లేదు. ఓవర్ డ్యూస్ ఉంటే తాము ఉన్నతాధికారుల నుంచి మాట పడాల్సి వస్తుందని భావించిన కొంత మంది బ్యాంకర్లు అలాంటి సంఘాలకు రుణాలు ఇచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. మహిళలు స్వయం సహాయక సంఘంలో వచ్చే రుణాలతో దుకాణాలు, పాడి పశువుల పెంపకం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఓవర్ డ్యూస్‌ను బూచిగా చూపి సకాలంలో కంతులు చెల్లిస్తున్న సంఘాలకు కూడా రుణాలు ఇవ్వడం ఆపేస్తే ఎలాగని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పక్కనపెట్టి అర్హత ఉన్న సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
వడ్డీ లేని రుణం ఉత్తిదే!
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు పావలా వడ్డీ రుణాల కింద 2010-11లో రూ.361 కోట్లు, 2011-12లో రూ.462 కోట్లు మంజూరయ్యాయి. 2012-13లో వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం కేవలం రూ.273 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. 2012 జనవరి నుంచి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని హామీ ఇచ్చిన సీఎం కిరణ్ అప్పుడే మాటమార్చారు.
ఇప్పట్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వలేమని, 2013 జూలై నుంచి అమలు చేస్తామన్నారు. అప్పట్లో సీఎం ఆర్భాటంగా ఇచ్చిన హామీతో మహిళలు విరివిగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వడ్డీ రాలేదని, వెంటనే వడ్డీ చెల్లించాలంటూ బ్యాంకర్లు మహిళలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేది లేక అప్పులు తెచ్చి బ్యాంకులకు వడ్డీ చెల్లించారు. ఈ తరహా బ్యాంకులకు మహిళలు చెల్లించిన వడ్డీనే రూ.24.51 కోట్లకు చేరింది. అయితే తాము చెల్లించిన ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందా అని మహిళలు ఎదురు చూస్తున్నారు.
బ్యాంకర్లతో చర్చిస్తున్నాం : నీలకంఠారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ
జిల్లాలో 2013-14 జనవరి నెలాఖరు నాటికి రూ.465 కోట్లు బ్యాంక్ లింకేజీ ద్వారా మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికీ రూ.410 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన మొత్తాన్ని నెలాఖరులోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పాతబకాయిలు ఉన్నాయన్న కారణంగా కొంత మంది బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు నా దృష్టికి వస్తున్నాయి. ఈ విషయమై బ్యాంకర్లతో చర్చిస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి రుణాల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటాం..
నాలుగేళ్లుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం
నాలుగేళ్లుగా రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా రుణం మంజూరు చేయలేదు. గతంలో మేము మూడు సార్లు రుణం పొందాము.నెలవారీ కంతులు కూడా సక్రమంగా చెల్లించాం. ఆ తర్వాత ఎందుకో రుణం మాత్రం మంజూరు చేయలేదు.అధికారులకు అడిగితే ఇదిగో అదిగో అంటున్నారు.
- లక్ష్మీదేవి,తారకరామా మహిళా సంఘం,కదిరి మండలం
అప్పుల తిప్పలు
Published Fri, Jan 24 2014 2:40 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement