ఆ ఆరడుగుల జాగా కోసం ఓ పేద వలస కుటుంబం నానా పాట్లు పడింది. మృతదేహం ఖననాన్ని కొందరు స్థానికులు అడ్డుకోగా..
♦ మృతదేహం ఖననాన్ని అడ్డుకున్న స్థానికులు
♦ ఉదారత చాటుకున్న రిటైర్డ్ ఉద్యోగి, లారీడ్రైవర్
కోదాడ: ఆ ఆరడుగుల జాగా కోసం ఓ పేద వలస కుటుంబం నానా పాట్లు పడింది. మృతదేహం ఖననాన్ని కొందరు స్థానికులు అడ్డుకోగా.. అదే సమయంలో మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తరలించేందుకు ఇద్దరు వ్యక్తులు సహకరించి మానవత్వాన్ని చాటారు. ఈ ఘటన సోమవారం నల్లగొండ జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన డేవిడ్‌సన్ కుటుంబం కోదాడకు వలస వచ్చింది. రోడ్డు వెంట టెంట్ వేసుకుని నివాసం ఉంటోంది. ఈ కుటుంబం గ్రామాల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ ఉయ్యాలలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. డేవిడ్‌సన్ తండ్రి రాయిసన్ (85) ఎండ వేడికి ఆదివారం రాత్రి మరణించాడు.
వారు క్రైస్తవులు కావడంతో ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయాలి. అయితే, కోదాడలో వారికి శ్మశానవాటిక లేకపోవంతో డేవిడ్ తన తండ్రి మృతదేహాన్ని పెద్ద చెరువు సమీపంలో ఖననం చేసేందుకు తీసుకెళ్లాడు. గొయ్యి తవ్వుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఏం చేయాలో తోచక డేవిడ్ తన తండ్రి శవంతో రోడ్డు మీదికొచ్చాడు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఒక విశ్రాంత ఉద్యోగి గమనించి అతడిని విచారించాడు. మృతదేహాన్ని సొంత రాష్ట్రం ఒడిశాకు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పడంతో రూ.10 వేలు అందించాడు. డేవిడ్‌సన్ తన తండ్రి శవంతో కోదాడ బైపాస్‌రోడ్డుకు వెళ్లాడు. కోదాడ నుంచి సిమెంట్ లోడ్‌తో ఒడిశా వెళుతున్న లారీడ్రైవర్ సైతం మానవతను చాటుకున్నాడు. మృతదేహాన్ని ఉచితంగా తీసుకెళ్లడానికి అంగీకరించాడు. ఎట్టకేలకు మృతదేహం తీసుకుని కుటుంబంతోసహా ఒడిశా వెళ్లాడు.