అతివకు అందలం..ఆవిష్కరణలకు ప్రోత్సాహం...స్టార్టప్స్‌కు సహాయం...ఇవే ప్రధాన ఇతివృత్తంగా సాగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. మూడురోజుల సందడికి గురువారం తెరపడింది. భాగ్యనగరి అందాలు, దేశీయ ఆవిష్కరణలను చూసి అబ్బురపోయిన విదేశీ ప్రతినిధులు... భారంగా బై..బై.. చెప్పారు. మెట్రో నగరికి మళ్లీ వస్తామంటూ దేశవిదేశీయులు వీడ్కోలు పలికారు.
అవకాశాలు పుష్కలం.. అందుకోవాలి ‘నైపుణ్యానికి అద్దం పడుతూ ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. స్టార్టప్స్‌తో అసామాన్య ఫలితాలు సామాన్యులకు చేరువవుతాయి. వీటికి పెట్టుబడులతో ప్రోత్సాహం అందిస్తే విజయం సొంతమవుతుంది. ఉద్యోగం చేయడం కంటే.. పది మందికి ఉపాధి కల్పించడంలోనే సంతృప్తి ఉంటుంది. వ్యవసాయం, వైద్యం తదితర రంగాల్లో నూతన స్టార్టప్‌లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాల’ని జీఈఎస్‌కు హాజరైన పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. తమ ఆవిష్కరణలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
డిజిటల్ అగ్రికల్చర్
వ్యవసాయానికి ఐటీని తోడు చేయాలనే సంకల్పంతో రెండేళ్ల క్రితం ఓ ప్రత్యేక యాప్ రూపొందించాం. సీజన్‌కు అనుగుణంగా ఏయే పంటలు వేయాలి? చీడపీడలకు ఏయే క్రిమిసంహార మందులు వాడాలి? తదితర సమాచారం ఇందులో ఉంటుంది. రైతులు, కంపెనీలు వివరాలూ ఉంటాయి. త్వరలోనే మార్కెటింగ్ అవకాశాలనూ చేర్చనున్నాం. పెట్టుబడి దొరికితే మా యాప్‌ను సామాన్యులకు చేరువ చేస్తాం.
– జయ వల్లపు, ఫౌండర్, స్టాంప్ ఐటీ సొల్యూషన్స్
బొమ్మల తయారీ..
అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పిల్లలు ఆడుకునే చెక్క బొమ్మలు తయారు చేస్తాం. ఏ చెక్కతో ఏ బొమ్మలు తయారు చేయాలో తెలియజేస్తాం. 3–13 ఏళ్ల పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసేందుకు వీలుంటుంది. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాం. – అశ్విని కుమార్, కో–ఫౌండర్, స్మార్టివిటీ
ఇవాంకా స్ఫూర్తి...
జీఈఎస్ సద్సులో ఇవాంకా ప్రసంగం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సదస్సులో చాలా నేర్చుకున్నాను. వ్యాపార రంగంలో మహిళలు రాణించేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. – అబ్బిగేల్ లాంక్, గయానా
టెలీ మెడిసిన్..
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా డాక్టర్ల వివరాలు సామాన్యులకు ఇప్పటికీ అందుబాటులో లేవు. ఆస్పత్రులు ఎక్కడుంటాయో? ఏ జబ్బుకు ఎక్కడికి వెళ్లాలో? తెలియని పరిస్థితి ఉంది. సామాన్యులకు వైద్య సమాచారం అందించేందుకు ‘ఇంటెలె హెల్త్’ పేరుతో టెలీ మెడిసిన్ సర్వీస్‌ను ఒడిశాలో ప్రారంభించాం. పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాం. – నేహా గోయల్, సీఈఓ, ఇంటెలె హెల్త్
అవకాశాలెన్నో...
వ్యాపార రంగంలో మహిళలకు ఎన్ని అవకాశాలున్నాయో జీఈఎస్ సదస్సులో స్పష్టంగా అర్థమైంది. వివిధ దేశాల బృందాలు తమ అనుభవాలు పంచుకున్నాయి. గోల్కొండ విందు బాగుంది. సదస్సుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సూపర్. – ప్రభా రాఘవ, యూఎస్‌ఏ
నైపుణ్యానికి కొదవలేదు
ఇండియాలో నైపుణ్యానికి కొదవలేదు. ఎందరో ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్టప్‌లపై దృష్టిసారిస్తున్నారు. యువత స్టార్టప్‌లపై ఉత్సా హం చూపుతోంది. అయితే ప్రభుత్వాలు, కంపెనీల ప్రోత్సాహం ఉంటేనే స్టార్టప్‌లు
నిలబడతాయి. – కార్ల్ బిజ్లాండ్, స్వీడన్
గ్రీన్ టీ ఫ్లేవర్స్..
వివిధ ఫ్లేవర్లలో గ్రీన్ టీ తయారు చేసే విధానాన్ని వివరిస్తాం. గ్రీన్ టీ అంటే.. చేదు, వగరు అనుకుంటారు. కానీ దీన్ని వివిధ ఫ్లేవర్లలో అందించొచ్చు. మెక్సికో, అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులకు టీ ఫ్లేవర్లను వివరించాం. – నీలిమా చౌదరి, ఫౌండర్, ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్
Comments
Please login to add a commentAdd a comment