మంత్రి కేటీఆర్ జిమ్‌లో కసరత్తులు చేశారు. వివిధ పరికరాలను పరిశీలించారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్‌లో రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన వివిధ సదుపాయాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి జిమ్‌లో కాసేపు గడిపారు.
గచ్చిబౌలి: గ్రేటర్‌లో ఫారెస్ట్ బ్లాకులను అభివృద్ధి చేస్తామని మున్సిపల్ మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్‌లో రూ.5కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన వివిధ సౌకర్యాలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అర్బన్ మిషన్ కాకతీయలో భాగంగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులను ప్రక్షాళన చేసి, సుందరీకరణ పనులు చేపడతామన్నారు. తొలి దశలో 40 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో రెండు వేల ఎంఎల్‌డీ ద్రవ వ్యర్థాలు వెలువడుతుండగా, కేవలం 700 ఎంఎల్‌డీ మాత్రమే ఎస్‌టీపీల ద్వారా శుద్ధి అవుతోందన్నారు. ఎస్టీపీల సంఖ్యను పెంచి ద్రవ వ్యర్థాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. త్వరలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుతో జీహెచ్‌ఎంసీ ఖజానాకు రూ.100 కోట్లు ఆదా అయిందన్నారు. సోలార్, విండ్ పవర్‌తో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతోందన్నారు. సోలార్ ఎనర్జీలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను దశలవారీగా ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తామని చెప్పారు. కన్జర్వేషన్ జోన్‌లో నిబంధనలు మరింత కఠినం చేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. చెరువుల కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
25వేల మొక్కలు నాటాలని పిలుపు...
12 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్‌ను ఆహ్లాదంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. హరితహారంలో భాగంగా మిగిలిన 262 ఎకరాల్లో ఒకే రోజు 25వేల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. బొటానికల్ గార్డెన్‌లోని చెట్లకు నీటిని అందించేందుకు ఎస్‌టీపీ ప్లాంట్‌ను మంజూరు చేస్తునట్లు ప్రకటించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో కండ్లకోయ, శంషాబాద్, నారపల్లిలో ఇప్పటికే ఫారెస్ట్ బ్లాకులు అభివృద్ధి చేశామని, త్వరలో మరిన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా మెర్సర్ సంస్థ అధ్యయనంలో హైదరాబాద్ నిలిచిందని చెప్పారు. అయితే పరిస్థితి ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
230 కోట్ల మొక్కల పెంపకం...
అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా 230 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. ఇది ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ప్రయత్నామని పేర్కొన్నారు. 80 ఫారెస్ట్ బ్లాక్‌లు, 99 కన్జర్వేషన్ బ్లాక్‌లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండా దామోదర్‌రెడ్డి, ఎండీ చందన్‌మిత్రా, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే గాంధీ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాతయాదవ్, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, హమీద్ పటేల్, జగదీశ్వర్‌గౌడ్, పూజిత, మేకా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment