మంచిర్యాల రూరల్ : ఎండలు ముదురుతున్నకొద్దీ అడవుల్లో అగ్గి రాజుకుంటోంది. ఇప్పటికే అడవుల్లో మంటలు చెలరేగి సగం అడవులు అగ్ని ఆహుతి కాగా.. మరికొన్ని చోట్ల రాత్రి, పగలు తేడా లేకుండా అడవులు మండుతూనే ఉన్నారుు. అరుునా అటవీశాఖ అధికారుల్లో చలనం రావడం లేదు. అడవుల్లో నుంచి రహదారులు ఉండడం వల్ల వీటి వెంట నిత్యం వేలాది మంది ప్రయూణం చేస్తుంటారు. కొందరు బీడీ, చుట్ట, సిగరేట్ వంటివి కాల్చి రోడ్డు పక్కన పడేస్తుడడంతో అవి ఎండిన ఆకులు, గడ్డిపై పడి మంటలు అంటుకుని అడవిని దహించి వేస్తున్నారుు. దీంతో పచ్చని అడవులు ఇట్టే కాలిపోతున్నాయి.
మంచిర్యాల మండలం గఢ్‌పూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న అడవిలో ప్రతి రోజూ మధ్యాహ్నం సమయంలోనే ఎక్కువగా మంటలు అంటుకుంటున్నాయి. అయినా.. అటవీ శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో కొంత మోడుబారిన చెట్లకు మంటలు అంటుకుని అవి చిగురించని పరిస్థితికి చేరుతున్నాయి. జనవరి చివరిలోనే అడవి మార్గంలోని రోడ్ల పక్కన మూడు మీటర్ల వరకు ఎండిన ఆకులు, ముళ్లకంపలు, గడ్డి చెత్తాచెదారం తొలగించాల్సి ఉంది. కానీ అధికారులు అలాంటి పనులేవీ చేపట్టలేదు. రోడ్డుకిరువైపులా పేరుకుపోయిన ఎండిన చెత్తలో, రోడ్డుపై వెళ్లే వారు బీడీ, సిగరెట్టు వంటివి తాగి పడేయడంతో అడవిలో అగ్గి రాజుకుని అడవినే దహించి వేస్తుంది. పచ్చగా ఉండాల్సిన అడవులు ఎండుబారడంతో, అగ్ని ప్రమాదంతో చెట్లకు నష్టం కలుగుతుండగా, అడవిలోని జంతువులకు సైతం ప్రాణనష్టం తప్పడం లేదు. గుంపులు గుంపులుగా తిరిగే వన్యప్రాణులు, అగ్ని వల్ల కలిగే వేడితో చెల్లాచెదురు అవుతున్నాయి.
రూ.కోట్ల విలువైన కలప బుగ్గి జిల్లా విస్తీర్ణం దాదాపుగా 16.21 లక్షల హెక్టార్లు. ఇందులో 7.15 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అడవులను కాపాడటానికి ప్రభుత్వం ఆదిలాబాద్, నిర్మల్, జన్నారం(వన్యప్రాణి సంరక్షణ విభాగం), మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ అటవీ డివిజన్లను ఏర్పాటు చేసింది. కానీ ప్రతి ఏడాది వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవుల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఏటా వేలాది ఎకరాల్లో రూ.కోట్ల విలువైన కలప బుగ్గి అవుతోంది. వన్యప్రాణులకు ఆహారం దొరకని పరిస్థితి. అటవీశాఖ వీఎస్‌ఎస్‌ల ద్వారా రూ.లక్ష వ్యయం తో అడవుల రక్షణకు ఏర్పాటు చేసిన కంచెలు, అడవుల్లో నాటే మొక్కలు అగ్గి పాలవుతున్నాయి. అసలే వేసవి ఎండలు గత కొన్ని రోజులుగా విశ్వరూపం చూపిస్తుండడంతో అడవి అంతా మోడువారింది.
ఇలా అడవులు కాలుతుండడంతో ఎండుగడ్డి కూడా దొరుకక వన్యప్రాణులు అంతరించే ప్రమాదం ఉంది. పశువులు, గొర్రెలు, మేకల మందలు ఉన్న వారు మేత కోసం అడవులకు వెళ్లలేక ఇంటి వద్ద మేత పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఔషధ మొక్కలు కూడా కాలిపోతున్నాయి. అడవులు ప్రమాదవశాత్తు కాలుతున్నాయా? ఎవరైనా అగ్గి రాజేస్తున్నారా? అనేది అంతుచిక్కడం లేదు. ఎండిన కట్టెలు తెచ్చుకునేందుకు సమీప గ్రామాల్లోని వారే అడవిలో అగ్గి రాజేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా అడవులను కాపాడాల్సిన ఆ శాఖ అధికారులు స్పందిస్తే, అడవులను అగ్ని నుంచి కొంత వరకైనా కాపాడుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే హరితహారం పేరుతో రాష్ట్రం లో చెట్లను లక్షల సంఖ్యలో పెంచేందుకు సిద్ధమైంది. కొత్తగా మొక్కల పెంపకం మాటేమో గానీ ఉన్న చెట్లను కాపాడుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.