ఆవిర్భావ దినోత్సవంపై ఆశలు
నోటిఫికేషన్ల కోసం లక్షలాది నిరుద్యోగుల ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నాటికి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతాయన్న ఆశతో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అయితే రాష్ట్రం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ కాకపోవడంతో వారు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలంటే ప్రభుత్వం, ఆయా శాఖల నుంచి మూడు ప్రధానమైన అంశాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.
పోటీ పరీక్షల విధానం, సిలబస్ ఫైలుకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. దీనిపై ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక పంపి మూడు నెలలు కావస్తోంది. మరోవైపు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచుతామని అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం దీనిపైనా ఉత్తర్వులు ఇవ్వలేదు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆయా శాఖలు ఇండెంట్లు ఇవ్వాల్సి ఉంది. వీటిపై స్పష్టత వస్తేనే నోటిఫికేషన్లను జారీ సాధ్యపడుతుంది. విభజనతో సంబంధంలేని పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాం టి పోస్టులు 76,548 ఉన్నాయని, అయినా వాటి భర్తీ విషయంలో జాప్యం చేస్తోందని వాపోతున్నారు.
విభజన సమస్యలు లేకపోయినా దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా స్థాయి పోస్టుల్లో గెజిటెడ్ కేటగిరీలో 592, ఎన్‌జీవో కేటగిరీలో 59,231, లాస్ట్‌గ్రేడ్ కేటగిరీలో 14,353, ఎయిడెడ్ విభాగాల్లో 2,369 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు, రాష్ట్రంలో 17,702 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రేషనలైజేషన్ చేస్తే తప్ప ఇందులో ఎన్ని పోస్టులు అవసరమవుతాయో స్పష్టత రాదంటున్నారు. పోలీసు కానిస్టేబుళ్లు (డ్రెవర్లు) 3,620, ఇరిగేషన్‌లో డీఈఈలు 26, విద్యుత్తు విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్లు 1492, సబ్ ఇంజనీర్లు 427, నీటి పారుదల శాఖలోనే 635 ఏఈ పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపినా నోటిఫికేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.