కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు.
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలివీ.. మండలంలోని కనుకుల పంచాయతీ రామునిపల్లికి చెందిన కొమ్మిడి రాజిరెడ్డి(50)కి చెందిన పొలం పక్కనే మరో రైతు(పెరట్ల రాజిరెడ్డి) భూమి ఉంది. రెండు రోజుల క్రితం ఆ రైతు క్రేన్ సాయంతో తన బావిలో పూడిక తీసేందుకు ప్రయత్నించాడు. దీనిపై కొమ్మిడి రాజిరెడ్డి తహశీల్దార్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో హుటాహుటిన ఆర్‌ఐ షఫీయొద్దిన్, విఆర్వో వెంకటేశ్వర్‌రావును పంపించి పనులను నిలుపుదల చేసి విద్యుత్ మోటార్‌ను తొలగించారు. కానీ, క్రేన్‌ను తొలగించకపోవడంతో పూడిక పనులు కొనసాగుతున్నాయి. దీనిపై మనస్థాపానికి గురైన రాజిరెడ్డి పురుగుల మందు డబ్బాతో మంగళవారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
ఉద్యోగులు గమనించి అతడిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. దీనిపై తహశీల్దార్ రజిత వివరణ కోరగా రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయగా బావి పూడిక తీత నిలిపివేసి క్రేన్ సీజ్ చేసినట్లు ఆమె వివరించారు.